పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల జాబితాల్లో కడియం శ్రీహారి.. బీఆర్ఎస్ హిట్ లిస్టులో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. బీఆర్ఎస్ హయాంలో డిప్యూటీ సీఎం పదవిని అనుభవించిన కడియం..అధికారం కోల్పోయాక పార్టీ మారడాన్ని సహించలేకపోతోంది. ఎంపీ ఎన్నికల సమయంలో కడియం రాజకీయం చూసి కారు పార్టీ ఖంగుతిన్నది. కూతురు కోసం ఆఖరి క్షణంలో బీఆర్ఎస్ టికెట్ ను సైతం కాదనుకొని కాంగ్రెస్ లో చేరి, వరంగల్ టికెట్ ను కావ్యకు ఇప్పించుకున్నారు.
అందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వదలవద్దు అని బీఆర్ఎస్ ఫిక్స్ అయ్యేందుకు కడియం ఊహించని రాజకీయం ఓ కారణమే. దాంతో కడియంతోపాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు తలుపుతట్టింది బీఆర్ఎస్. అక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ కు సుప్రీం ఇస్తున్న ఆదేశాలతో తెలంగాణలో ఉప ఎన్నికలు తథ్యం అంటూ కేటీఆర్ అండ్ కో విస్తృత ప్రచారం చేస్తోంది.
కడియం శ్రీహారిపై బలంగా ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్… ఆయనపై భూకబ్జా ఆరోపణలు చేసింది. దేవనూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ , మొత్తంగా 2వేల ఎకరాలను భూకబ్జా చేశారని తాటికొండ రాజయ్య ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అదే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఓ చోట 25ఎకరాలు , మరో చోట యాభై ఎకరాలు కడియం కబ్జా చేశారని, వాటిని బినామీలకు అప్పగించారన్నారు.
వీటిని బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. కడియం కబ్జాకహానీలు అంటూ దుమ్మెత్తిపోసింది. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా కోసం, ఉప ఎన్నిక కోసం తెగ ఆరాటపడుతోన్న బీఆర్ఎస్ కు తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించారు కడియం.
తాను గుంట భూమి కూడా కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. పదవికి రాజీనామా చేసి పల్లా, రాజయ్య ఇంట్లో గులాంగా పని చేస్తానని, తనపై వారిద్దరూ చేసిన ఆరోపణలను నిరూపించకపోతే వారు గులాంలుగా ఉంటారా? అని ప్రశ్నించారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలపై చట్టపరమైన చర్యలు చేపడుతానని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ను నమ్మించి మోసం చేశారని కడియంపై కారాలు, మిరియాలు నూరుతున్న బీఆర్ఎస్ కు ఇది రాజకీయంగా మంచి అవకాశం. భూకబ్జా చేసినట్లు ఆధారాలను బయటపెడితే ఆయన రాజీనామా చేస్తారో లేదో కానీ, రాజకీయాల్లో కడియం ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. ఈ అంశం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు స్టేషన్ ఘన్ పూర్ లో తిరుగులేని అస్త్రంగా మారుతుంది.
ఇప్పుడు అసలు విషయం ఏంటంటే…ఇప్పుడు కడియం సవాల్ ను పల్లా, రాజయ్యలు సీకరిస్తారా? లేదా అనేది పాయింట్. ఒకవేళ , కడియం సవాల్ ను వారిద్దరూ స్కిప్ చేస్తే రానున్న రోజుల్లో కడియంపై బీఆర్ఎస్ లీడర్లు చేసే ఆరోపణలకు విశ్వసనీయత ఉండదు. దీంతో ఆరోపణలు చేసిన ఆ ఇద్దరు లీడర్లు గులాంలుగా మారుతారా? గులాంగిరి చేయిచుకుంటారా చూడాలి!