చింత చచ్చినా పులుపు చావలేదని కొంత మంది అంటూ ఉంటారు. వైసీపీ నేతలు గట్టిగా కుర్చీల్లోంచి లేవలేరు కానీ..కొట్టుకు, నరుకుడు భాషను మాత్రం వదిలి పెట్టడం లేదు. అధికారం వస్తే చాలు చంపడానికి, నరకడానికి, కొట్టడానికి ప్రజలు లైసెన్స్ ఇచ్చేసినట్లేనని అనుకుంటారేమో కానీ.. బెదిరింపుల రేంజ్ కు వస్తున్నారు. ఉదయం జగన్ రెడ్డి పోలీసుల బట్టలిప్పదీస్తానని బెదిరిస్తే.. మా బాస్ కంటే రెండాకులు ఎక్కువే తిన్నానని తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు బయలుదేరారు. ఆయన సినిమా రైటర్ ని తన స్పీచ్‌ల కోసం రాసుకున్నారేమో కానీ.. గట్టిగానే డైలాగులు చెప్పే ప్రయత్నం చేశారు.
గుంటూరు ఇవతల ప్రాంతంలో ఒక్కొక్కరిని ఇళ్లలోంచి లాగి కొడతారట.. అవతల ప్రాంతంలో దొరికిన వారిని అడ్డంగా నరుకుతారట. బహిరంగంగానే ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఆయన ఫ్యాక్షన్ లీడర్ గా అవతారం ఎత్తాలనుకుంటున్నారో .. లేకపోతే పాత సినిమాల్లో విలన్లకు ఉన్నట్లుగా కింటి కింద పెద్ద పుట్టు మచ్చ ఉంటుంది కాబట్టి తాను పెద్ద విలన్ అని అనుకుంటున్నారో కానీ.. కొట్టుడు, నరుకుడు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాటలు విని ఎదురుగా ఉన్న వారు ఆశ్చర్యపోయారు.
కానీ ఆయన అర్థం కాలేదో.. ఆవేశపడ్డారో కానీ .. ఆయన అధికారంలోకి వస్తారో రారో తెలియదు వారు ఎవర్నీ హెచ్చరించారో వారు ఇప్పుడే అధికారంలో ఉన్నారు. వారు అనుకుంటే గుంటూరు మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది ఇలాంటి పనులు చేయడానికి కాదని.. ప్రజలు ఇచ్చిన బాధ్యతను వారు చేసుకుంటున్నారు. వారిని రెచ్చగొట్టి ఏం చేద్దామనుకుంటున్నారో కానీ.. కారుమూరి పర్సనాల్టీకి ఆయన చెబుతున్న డైలాగులకు పొందన లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి..టీడీఆర్ స్కాములు చేసి..జైలుకు దగ్గర్లో ఉన్న కారుమూరి ఇలాంటి మాటలు.. డైలాగు చెప్పి త్వరగా జైలుకెళ్లి సానుభూతి పొందే ప్రయత్నంలో ఉన్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.