కొత్తగా ఇళ్లు కొనాలనుకునేవారికి మరింత బూస్టప్ ఇచ్చే నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6.25 నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించి పడేసింది. ఆర్బీఐ వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గించటం విశేషం. ఆర్బీఐ నిర్ణయంతో గృహ రుణాలతో పాటు పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.
ఇతర రుణాల విషయం పక్కన పెడితే దీర్ఘకాలిక రుణాల్లో హోమ్ లోన్స్ కీలకం. మార్కెట్ పుంజుకోవడానికి కూడా హోమ్ లోన్స్ చాలా ముఖ్యం. అందుకే ఎక్కువ మంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వడ్డీరేట్ల తగ్గింపు కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్బీఐ ఇప్పటికే ఓ సారి వడ్డీ రేట్లను తగ్గించింది. రెండో సారి వరుసగా రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించడంతో మూడు నెలల వ్యవధిలో యాభై బేసిస్ పాయింట్లు తగ్గించినట్లయింది.
ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా గతంలో వడ్డీ రేట్లను అర్బీఐ వరుసగా పెంచుకుంటూ పోయింది. ఫలితంగా హోమ్ లోన్లు సూసైడ్ లోన్లుగా మారాయన్న విమర్శలు వచ్చాయి. ఇరవై ఏళ్ల కాలానికి రుణం తీసుకున్న వారికి ముఫ్ఫై ఏళ్లు ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల వారంతా మళ్లీ బయటపడే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఇళ్లు కొనాలనుకునేవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి.