రేవంత్ రెడ్డి పలుకుబడి హైకమాండ్ వద్ద తగ్గిపోయిందని ఆయనను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. గతంలో అలాంటి ప్రచారమే చేశారు. మళ్లీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇటీవల బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేపడితే అసలు రాహుల్ లేదని కానీ తర్వాత రోజే ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతల్ని పిలిపించుకుని రాహుల్, సోనియా సమావేశమయ్యారని హరీష్ రావు అంటున్నారు. ఢిల్లీలోనూ రేవంత్ సీన్ అయిపోయిందని సంబరంగా చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి ఎంత బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ అంత కంటే ఎక్కువ బలహీనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ కానివ్వకూడదని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా సార్లు అరెస్టులు కూడా చేశారు. ఆయనకు పదవి ప్రకటిస్తారన్న సమాచారం రాగానే ఇక్కడ్ డ్రోన్ లాంటి కేసుల్లో అరెస్టులు చేసేవాళ్లు. జైల్లో ఉన్న వ్యక్తికి పీసీసీ చీఫ్ ఇస్తారా అన్న ప్రశ్న వచ్చేలా చేసి కొంత కాలం ఆపగలిగారు. గాంధీభవన్ లో గాడ్సే అని ఆ తర్వాత కూడా విమర్శలు గుప్పించారు.
కానీ అదే రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టమే. అందుకే రేవంత్ ను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ అసలు పోటీనే కాదని.. బీఆర్ఎస్ నేతల నమ్మకం కావొచ్చు. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు అసంతృప్తి ఉందో లేదో కానీ.. ఆ ప్రచారం మాత్రం బీఆర్ఎస్ నేతలు జోరుగా చేసి..ఆనందపడుతున్నారు. వారి ఆనందంలో నిజం ఉందో.. అనుకుని సంతోషపడుతున్నారో వారికే తెలియాలి.