జగన్ రాప్తాడు పర్యటన… వచ్చామా.. వెళ్ళామా అన్నట్లు సాగడంతో పాపం తెగ ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు వైసీపీ నేతలు. తాము ఏదో అనుకుంటే మరేదో అయిందన్న డిసప్పాయింట్ వారిలో కనిపిస్తోంది. వాస్తవానికి జగన్ రాప్తాడు పర్యటనకు పోలీసులు అభ్యంతరం చెబుతారని, వారిని బేఖాతరు చేస్తూ జగన్ వస్తే భారీ ఎలివేషన్ వస్తుందని అంచనా వేశారు..కానీ, తీరా ఎలాంటి ఆటంకాలు లేకుండా వందలాది మంది పోలీసు సిబ్బంది నడుమ జగన్ టూర్ సావ్యంగానే సాగడంతో అనుకున్నదొకటి, అయింది మరొకటి అన్నట్టు నిట్టూరుస్తున్నారు.
అటు చాలా రోజుల తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినా వైసీపీ నేతల్లో , జనాల్లో మునుపటి ఎమోషన్ లేదు. రియాక్షన్ అంతకన్నా లేదు. జగన్ జనాల్లోకి వచ్చినా ఫలితం బెడిసికొట్టడంతో ఇక వైసీపీ నేతలు ప్లేట్ ఫిరాయించారు. జగన్ కు సరైన భద్రత కల్పించలేదని కొత్త పల్లవి అందుకున్నారు
నిజానికి పరిటాల అడ్డాకు జగన్ వచ్చి ఎలాంటి అల్లర్లు చెలరేగకుండానే తిరిగి వెళ్లారంటే పోలీసు బందోబస్తు ఏమేర చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. అయినా భద్రత సరిగా లేదంటూ చెప్పుకొచ్చారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. దేశంలో అత్యధిక ప్రజాదరణ కల్గిన నేత జగన్ అని , ఆయన పర్యటనలో భద్రతా వైఫల్యాలు చోటు చేసుకున్నాయంటూ ఏవేవో చెప్పుకుంటూపోయారు.
జగన్ దేశంలో అత్యధిక ప్రజాదరణ కల్గిన నేత అంటూ శ్రీకాంత్ రెడ్డి అలా కామెంట్స్ చేశారో లేదో…. ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది . జగన్ కు రాష్ట్రంలో జనాదరణ ఉంటే వైసీపీ ఎందుకు 11 సీట్లకు పరిమితం అవుతుంది.. ఆ పార్టీ పురుడుపోసుకున్న కడప గడపలో శ్రీకాంత్ రెడ్డి ఎందుకు ఓటమి పాలయ్యారో కూడా చెప్పాలంటూ వారిని సోషల్ మీడియాలో తెగ ఆడుకుంటున్నారు.