వైసీపీ నేతల్లో నెక్స్ట్ జైలుకు వెళ్లేందుకు మాజీమంత్రి కాకాని గోవర్ధన్ వంతు వచ్చినట్లే కనిపిస్తోంది. క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసును క్వాష్ చేయాలని కాకాని పిటిషన్ ను హైకోర్టు రెండువారాలపాటు వాయిదా వేసింది. కేసు నుంచి రక్షణ కల్పించాలని చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.
అక్రమ మైనింగ్ వ్యవహారంలో కాకానిపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని మూడు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా ఆయన హాజరు కాలేదు. కాకాని అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం జరుగగా.. తాను ఎక్కడికి పారిపోలేదని హైదరాబాద్ లోనే ఉన్నానని ఫోటోలు, పోస్టింగ్ లు చేశారు.
సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హైదరాబాద్ లో కాకాని ఇంటికి వెళ్లినా అక్కడ కనిపించలేదు. పోలీసుల దూకుడుతో కాకానికి సీన్ అర్థమైంది. దీంతో ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో కాకాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తీర్పు వచ్చేవరకు విచారణకు హాజరు కాకుండా గడపాలని అనుకున్నారు.
కానీ, హైకోర్టు ఈ పిటిషన్ ను రెండువారాలపాటు వాయిదా వేస్తూ, కేసు నుంచి ఆయనకు రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కాకానిపై పోలీసులు చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.