తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ సమర్థత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పదేళ్ల పాటు సీఎంవోలో అత్యంత కీలకమైన శాఖలను ఎలాంటి వివాదాలు లేకుండా నిర్వహించారు. ఇప్పుడు టూరిజం శాఖను లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించేందుకు తెలంగాణకు అవకాశం వచ్చేలా చేశారు. అంతే కాదు ప్రభుత్వాన్ని కూడా ఒప్పించారు. ఇప్పుడు ఆ పోటీలను సక్సెస్ చేసి.. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పేరు మారుమోగిపోయేలా చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు.
మే నెల మొదటి వారంలో ప్రారంభమై.. నెలాఖరు వరకూ జరిగే ఈ ఈవెంట్ లో .. తెలంగాణలోని అన్ని ప్రముఖ పర్యాటక క్షేత్రాలు కవర్ అయ్యేలా అన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్మితా సభర్వాల్ కు ఫ్యాషన్ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకే ఈ విషయంలో ఆమె ప్రయత్నాలు ఏ మాత్రం లోపం లేకుండా సాగుతున్నాయి. అధికార వర్గాల్లో ఫ్యాషన్ ఐకాన్ గా ఆమెకు పేరు ఉంది. ఇప్పుడు మిస్ వరల్డ్ వంటి పోటీలకు ప్రభుత్వం తరపున హోస్ట్ గా వ్యవహరిస్తున్నందున ఆమె తన వంతుగా పోటీలను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ అభిరుచిని బయట పెడుతున్నారు. స్మితా సభర్వాల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్టులు చూస్తే.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు.. సామర్థ్యంతో పాటు అందం కూడా ఉన్న అధికారి నియమితులయ్యారని ఎవరైనా అనుకోవడం సహజం. స్మితా సభర్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాషన్ షోలకూ తరచూ వెళ్తూంటారు. ఆమె అభిరుచితో.. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ అద్భుతంగా ఆతిధ్యం ఇస్తుందని అనుకోవచ్చు.