ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఇంత వరకూ విచారణకు హాజరు కాలేదు. మూడో సారి నోటీసులు ఇచ్చే ముందు హైకోర్టు రిలీఫ్ ఇచ్చేందుకు నిరాకరించడంతో బుధవారం ఆయన తప్పనిసరిగా హాజరవుతారని అనుకున్నారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు.
మద్యం స్కాం విషయంలో సీఐడీ సిట్ .. మొత్తం కూపీ లాగిందని ప్రతి అడుగులోనూ రాజ్ కసిరెడ్డి వ్యవహారంపై ఆధారాలు సేకరించిందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన విచారణకు హాజరైతే.. పోలీసులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమవుతుందని.. ఒక వేళ ఆయన ఏదైనా చిన్ సమాచారం లీక్ చేసినా.. సీఐడీ వద్ద ఉన్న సమాచారానికి బల పరిచేలా సమాధానం చెప్పినా బుక్కయిపోతామన్న ఉద్దేశంతో ఆయనను వైసీపీ పెద్దలు షెల్టర్లో ఉంచి విచారణకు హాజరు కాకుండా చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఏ స్కాం అయినా నిందితులు వెల్ ప్రిపేర్డ్ గా విచారణకు వస్తున్నారు. గుర్తు లేదు.. తెలియదు.. మర్చిపోయా అనే మూడు సమాధానాలు చెబుతున్నారు. కానీ ఆధారాలు ముందు పెట్టి వేసే ప్రశ్నలకు మాత్రం నీళ్లు నములుతున్నారు. అలాంటి సమాధానాలు చెప్పడానికి కూడా రాజ్ కసిరెడ్డి భయపడుతున్నారంటే.. ఏదో ఉందన్న అభిప్రాయం పెరగడానికి కారణం అవుతోంది.