కులగణన అంశాన్ని క్యాష్ చేసుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ విఫలమవుతోందా? ప్రధాన ప్రతిపక్షం రేవంత్ – రాహుల్ గాంధీల మధ్య గ్యాప్ అంటూ చేస్తోన్న వాదనకు బలం చేకూరేలా పాలిటిక్స్ ఉంటున్నాయా? బీఆర్ఎస్ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ, రేవంత్ ను రాహుల్ అభినందించినా బీఆర్ఎస్ వాదనకే ఎక్కువ విశ్వసనీయత ఉండనుందా? రాహుల్ గాంధీ తాజా రియాక్షన్ తో ఇప్పుడివే అంశాలపై చర్చ జరుగుతోంది.
కుల గణన చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని చేసిన తీర్మనాన్ని ఆమోదించాలని తెలంగాణ సర్కార్ కేంద్రానికి పంపింది0. ఈ అంశంపై కేంద్రం తన వైఖరి ఏంటో ఇప్పటికీ చెప్పడం లేదు. మోడీ సర్కార్ పై ఒత్తిడి పెంచేందు కోసం ఢిల్లీలో చేపట్టిన దీక్షలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల పాల్గొన్నారు. ఈ దీక్షలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని లీకులు ఇచ్చారు కానీ, రాహుల్ రాకపోవడంతో బీఆర్ఎస్ దాన్ని తమకు అడ్వాంటేజ్ గా మార్చుకుంటోంది.
మహాత్మా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి చేసిన తీర్మానంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాహుల్ – రేవంత్ రెడ్డిల మధ్య గ్యాప్ వచ్చిందని అందుకే ఈ దీక్షలో రాహుల్ గాంధీ పాల్గొనలేదన్నారు హరీష్ రావు.
కవిత , హరీష్ రావులు ఈ అంశంపై మాట్లాడిన సమయంలోనే రాహుల్ గాంధీ మాట్లాడారు. రేవంత్ రెడ్డి చేసిన కుల గణన దేశానికి మార్గం చూపిందని ప్రశంసించడంతో, బీఆర్ఎస్ చేస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. కానీ, కవిత , హరీష్ రావులు విమర్శలు చేసిన గంటల వ్యవధి లోనే రాహుల్… ఏఐసీసీ సమావేశంలో కుల గణన గురించి మాట్లాడారు. కవిత , హరీష్ ల వ్యాఖ్యలు రాహుల్ వరకు చేరకపోవచ్చు కానీ, దాన్ని బీఆర్ఎస్ కు ఆ పార్టీ అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది.
నిజానికి, తెలంగాణలో చేపట్టిన కుల గణన చారిత్రాత్మకమే. దాన్ని కాంగ్రెస్ గొప్పగా ప్రెజెంట్ చేసుకునే అవకాశం ఉంది. రాహుల్ కూడా దీన్ని పార్టీ మైలేజ్ కోసం వాడుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయడం లేదు. కుల గణనపై చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్ హాజరు కావాల్సింది. కానీ, ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ఏమో హాజరు కాలేదు.
ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న వేళ యాదృఛ్చికమో ఏమో కానీ, రాహుల్ స్పందించడంతో దీన్ని బీఆర్ఎస్ తమ ఒత్తిడి ఫలితంగా స్పందించారని చెప్పుకునే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలే అనుమానిస్తున్నాయి. ఏఐసీసీ ఎజెండాలో కుల గణన అనేది పెద్ద టాపిక్. అందుకే రాహుల్ ఈ అంశాన్ని ప్రస్తావించి ఉంటారు. కానీ , బీఆర్ఎస్ రాజకీయాలను గమనిస్తే.. రాహుల్ రియాక్షన్ బీఆర్ఎస్ ఒత్తిడి అంటూ చెప్పుకునే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. దీన్ని కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందనేది ఇప్పుడు కీలకం.