బుల్లితెరకి వెండితెరకీ మధ్య ప్రేక్షకులు స్పష్టమైన గీత గీసేశారు. ఏది థియేటర్స్ కి వెళ్లి చూడాల్సిన సినిమానో, ఏది టీవీలో చూడాలో వాళ్ళకి క్లారిటీ వుంది. ఇలాంటి పరిస్థితిలో టీవీలో నిత్యం కనిపిస్తూ ఏదో ఒక షోకి యాంకరింగ్ చేసే ప్రదీప్ లాంటి నటుడు ప్రేక్షకులని థియేటర్స్ లోకి తీసుకురావాలంటే చాలా ఎఫర్ట్ పెట్టాలి. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో నటుడిగా మారాడు ప్రదీప్. అందులో సిద్ శ్రీరామ్ పాడిన పాట తప్ప ఆ సినిమా ఎవరికీ గుర్తు కూడా లేదు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా చేశాడు. ఇది పవన్‌కల్యాణ్ తొలి చిత్రం పేరు కావడం కొంత బజ్ క్రియేట్ చేసింది. మరి ఇందులో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి చూడదగ్గ కంటెంట్ ఉందా? టైటిల్ కి న్యాయం జరిగిందా?
భైరిలంక అనే ఊరు కథ ఇది. ఈ ఊరుది వింత చరిత్ర. వంద గడపలకి పైగా వున్న ఆ ఊర్లో ఒక్క ఆడబిడ్డ కూడా పుట్టదు. ఒక జనరేషన్ మొత్తం మగ పిల్లలే. మొత్తం 60 మంది. ఊరికి ఏదో అరిష్టం తగిలిందని పెద్దలు భావిస్తారు. వర్షాలు లేక కరవు తాండవిస్తుంది. ఇలాంటి దశలో ఓ అమ్మాయి పుడుతుంది. ఆమె పుట్టగానే వర్షాలు కురుస్తాయి. ఆ అమ్మాయికి రాజకుమారి (దీపిక) అని పేరు పెడతారు. గ్రామ సర్పంచ్ రాజకుమారి పెళ్లి విషయంలో చిన్నప్పుడే ఓ తీర్మానం చేస్తాడు. రాజు ఊరు దాటి వెళ్లడానికి వీల్లేదని, ఊళ్లో ఉన్న 60 మంది కుర్రాళ్లల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని తీర్పు చెబుతాడు. అందుకు రాజకుమారి తల్లిదండ్రులు కూడా అంగీకారం చెబుతారు. రాజకుమారి పెరిగి పెద్దవుతుంది. ఆమె మనసు గెలుచుకునేందుకు ఊరి కుర్రాళ్లంతా పోటీ పడుతుంటారు. ఇలాంటి సమయంలో ఆ ఊరుకి ఓ ప్రాజెక్ట్ వర్క్ పై వస్తాడు ఇంజినీర్ కృష్ణ (ప్రదీప్ మాచిరాజు). రాజకుమారి, కృష్ణ ఇద్దరూ ప్రేమించుకుంటారు. తర్వాత ఏం జరిగింది? గ్రామ కట్టుబాట్లు, పెద్దల తీర్పు వీరి ప్రేమకు ఎలాంటి అవరోధాలు సృష్టించాయి? చివరికి రాజకుమారి ప్రేమకథకు శుభం కార్డ్ పడిందా లేదా? అనేది తక్కిన కథ.
‘డైలాగులు చెప్పడం కాదురోయ్.. చెప్పిన దానిమీద నిలబడాలి. నిలబడి చూపించాలి’ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తీసిన కొత్త దర్శకులు నితిన్ భరత్ చెప్పిన ఈ కథ చూశాక ఇదే డైలాగ్ మనసులో కదిలింది. ఒక కాన్ఫ్లిక్ట్ ని చెప్పడం కాదు.. చెప్పినదాని మీద నిలబడాలి. నిలబడి చూపించాలి. ఈ కథలో ఓ కాన్ఫ్లిక్ట్ చెప్పారు. కానీ దానిపై నిలబడలేదు. నిలబడి చూపించలేదు.
ఒక అమ్మాయి పెళ్లికి సంబధించిన కథ ఇది. ఆ అమ్మాయి ఇష్టంతో పనిలేకుండా చిన్నప్పుడే పెద్దలు ఒక తీర్మానం చేస్తారు. నిజంగా ఆ వూర్లో ఆ అమ్మాయి రాజకుమారిలానే పెరుగుతుంది. బయటి నుంచి వచ్చిన ఓ వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఆ అబ్బాయితో ఎవరికీ చెప్పకుండా ఊరు దాటేయొచ్చు. కానీ అమ్మాయి అభిమతం అది కాదు. చిన్నప్పటి నుంచి తనని రాజకుమారిలా చూసి గ్రామ ప్రజలంతా ఆనందంతో సాగనంపాలి. అప్పుడే ఆ అబ్బాయితో వెళుతుంది. నిజంగా ఈ పాయింట్ లో గొప్ప ఎమోషన్ వుంది. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ ని ఓపెన్ చేశారు కానీ దాన్ని సమర్దవంతంగా పరిష్కరించడంలో కథని జబర్దస్త్ స్కిట్స్ లా పల్టీలు కొట్టించేశారు.
నితిన్ భరత్ వెండితెరకు కొత్త. ఆ సంగతి వాళ్ళు ఈ కథని మొదలుపెట్టిన విధానంలోనే అర్ధమౌతోంది. చైల్డ్ ఎపిసోడ్స్ నుంచి కథని రాసుకుంటూ రావడం కొన్నిసార్లు మంచిదే కానీ అవి కథని లాగ్ చేసేస్తాయి. ఇందులో కూడా ఆ ఇబ్బంది వుంది. హీరోయిన్ వైపు నుంచి ఓ చైల్డ్ ఎపిసోడ్, హీరో వైపు నుంచి మరొకటి ఈ రెండూ పూర్తయినప్పటికే ప్రేక్షకుడిలో ఎక్కడో చిన్న విసుగు మొదలౌతోంది. ఆ తర్వాత కూడా పాయింట్ లోకి రారు. హీరో సత్య కలసి సీరియల్ పాటలతో అంత్యాక్షరి పాడుకుంటారు. అది ఫన్ కోసం అనుకున్నారమో కానీ అందులో స్క్రీన్ టైం అంటే లెక్కలేని తనం కనిపిస్తుంది. లవ్ ట్రాక్ కూడా బలంగా వుండదు. ఏదో టైం పాస్ వ్యవహారమే. సత్య గెటప్ శ్రీను కామెడీ ఫస్ట్ హాఫ్ లో కాస్త ఉపసమనం. అక్కడక్కడ కొన్ని జోకులు పేలాయి. దాంతో ఫస్టాఫ్ అలా.. అలా `ఓకే` అనిపిస్తుంది.
ఇంటర్వెల్ వరకూ ఎదోలా లాకొచ్చిన ఈ కథకి అసలు పల్టీలు సెకండ్ హాఫ్ లో మొదలౌతాయి. నిజానికి ఈ కథకి ఇంటర్వెల్ తర్వాత వచ్చే నెక్స్ట్ సీన్ లోనే ఎండ్ కార్డు పడిపోయింది. ఎప్పుడైతే రాజకుమారి ఊరు దాటిందో అప్పటివరకూ దర్శకులు బిల్డ్ చేసిన సెటప్ అంతా క్లోజ్. కానీ ఈ సంగతి దర్శకులు పసికట్టలేకపోయారేమో అనిపిస్తుంది. 60 మంది పెళ్లిళ్ల పాయింట్ తో సెకండ్ హాఫ్ నడిపారు. అదంతా వృధా ప్రయాస. సెకండ్ హాఫ్ నుంచి ఒకొక్క సీన్ ఒక్కొక స్కిట్ లా తీసుకుంటూ వెళ్లారు. బలవంతంగా నవ్వుకోవడం ప్రేక్షకులు వంతు. ఇక ముగింపు కూడా చాలా అర్టిఫిషియల్ గా వుంటుంది.
నటుడిగా ప్రదీప్ లో కొంత పరిణితి కనిపించింది. అక్కడక్కడా పవన్ కళ్యాణ్ ఇమిటేషన్ కనిపించింది కానీ ఓవరాల్ గా డీసెంట్ గా చేశాడు. అయితే డైలాగ్ మాడ్యులేషన్ పై కొంత దృష్టి పెట్టాలి. యాంకరింగ్ లా కొన్ని డైలాగులు ఫ్లాట్ గా చెప్పడం కనిపించింది. దీపిక అందంగా కనిపించింది. నిజానికి అది చాలా బరువైన పాత్ర. ఆ పాత్రని మోయడంలో కొంత ఇబ్బంది పడింది. ఈ సినిమాలో చెప్పుదగ్గ పాయింట్ సత్య కామెడీ. సీన్ వీక్ గా ఉన్నప్పటికీ తన డైలాగ్ బాడీ లాంగ్వెజ్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. తన క్యారెక్టర్ కొంతలో కొంత రిలీఫ్. గెటప్ శ్రీను కామెడీ బాగుంది కానీ చివర్లో ఆ పాత్రని మళ్ళీ జబర్దస్త్ గా మార్చారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ ట్రాక్స్ సరిగ్గా పండలేదు.
బాల్‌రెడ్డి కెమరా వర్క్ బావుంది. కొన్ని విజువల్ బ్యూటీ వున్న సీన్స్ వున్నాయి. రథన్ సంగీతం ఓకే అనిపిస్తుంది. కొత్త దర్శకులు నితిన్ – భరత్ ఓ పాయింట్ పట్టుకున్నారు కానీ దాని సుసంపన్నం చేయలేకపోయారు. కథలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయిపోయింది. అటు కామెడీ కూడా గొప్పగా పండలేదు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ టైటిల్ ని వాడుకున్నారు. అయితే దానికి సరైన న్యాయం జరగలేదనే చెప్పాలి.