బాగా హైప్ ఎక్కించుకుని.. ఒక్క సారిగా పిన్నుతో పొడిపించుకుంటే ఎలా ఉంటుంది?. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి అదే. అసలేమీ లేని దాంట్లో పెద్ద స్కామ్ అని నిరూపించాలని ఆయన తాపత్రయపడ్డారు. అసత్యాలు, అర్థసత్యాలతో ఓ రిపోర్టు తయారు చేసుకున్నారు. దానికి అదిగో.. ఇదిగో అని హైప్ ఎక్కించారు. చివరికి అది పేలిపోయింది. కేటీఆర్ కు ఈ విషయాలు తెలియవా లేకపోతే ఇలాంటి విషయాల గురించి ఎవరికీ తెలియవని చెప్పిందే నమ్ముతారని అనుకున్నారా ? అన్న చర్చ ప్రారంభమయింది.
పదివేల కోట్లులో ఒక్క రూపాయి స్కాం ఏది ?
కేటీఆర్ మీడియా సమావేశానికి ముందు చాలా హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్లుగా ఆయన స్కాం అని ప్రతి మాట ముందు వెనుకా చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణం చేసిందని పదే పదే చెప్పారు. కొన్ని పత్రాలు చూపించారు. ఆ పత్రాల్లో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం TGIIC ద్వారా 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూమిని తాకట్టు పెట్టి, ICICI బ్యాంకు నుండి బాండ్ల రూపంలో రూ.10,000 కోట్లు తీసుకుందని ఉందని చెప్పారు. అదెలా స్కామ్ అవుతుందో మాత్రం చెప్పలేదు. ఐసీఐసీఐ బ్యాంకుపై చాలా ఆరోపణలు చేశారు.
అరటి తొక్క ఒలిచి ఇచ్చినంత చక్కగా నాలుగు లైన్లలో క్లారిటీ ఇచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ !
ఐసీఐసీఐ బ్యాంక్ .. కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలకు కూల్‌గానే సమాధానం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి కానీ.. టీఎస్ఐఐసీకి కానీ ఎలాంటి మార్టిగేజ్ రుణం మంజూరు చేయలేదని స్పష్టం చేసింది. అలాగే బాండ్ల జారీకి సంబంధించి టీఎస్ఐఐసీ ..తమ వద్ద అంటే ఐసీఐసీఐ బ్యాంక్ ఎలాంటి స్థలాన్ని మార్టిగేజ్ చేయలేదని ప్రకటించింది. తాము కేవలం బాండ్ల జారీ ద్వారా వచ్చే నిధుల స్వీకరణ, వడ్డీ చెల్లింపులకు సంబంధించి టీఎస్ఐఐసీకి అకౌంట్ బ్యాంక్‌గా వ్యవహరించామని స్పష్టం చేసింది. అంటే అన్ని ప్రభుత్వాలు బ్యాంకులను మధ్యవర్తిగా పెట్టుకుని బాండ్ల ద్వారా రుణాలు సేకరిస్తాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేసింది. రుణం ఐసీఐసీఐ బ్యాంక్ ఇవ్వలేదు. అవి బాండ్లు.
చెట్లు ఉంటే అటవి భూమి అనుకోవాలా ?
కేటీఆర్ రేవంత్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి, ఆ ప్రభుత్వంపై బురద చల్లడానికి ఎంత డెస్పరేట్ గా ఉన్నారన్నదానికి అక్కడ అడవిలా ఉంది కాబట్టి అటవీ భూములేనని వాదించడమే సాక్ష్యం. అటవీ లక్షణాలు ఉన్న భూమి కావడంతో అటవీ ప్రాంతంగా పరిగణించాలని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మైహోం, రాజుపుష్ప లాంటి బడా సంస్థల హై రైజ్ అపార్టుమెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు కట్టక ముందు వాటికి.. ఆ స్థలాలు అప్పగించక ముందు కేటీఆర్ లెక్కల ప్రకారం అటవీ భూమే. మరి అప్పుడు ఇలా అనిపించలేదా అని అందరికీ వచ్చే సందేహం.
ఆ భూమిని అమ్మకుండా చేయాలన్న లక్ష్యం తప్ప స్కాం లేదు !
ఈ వివరాలన్నీ చూస్తే కేటీఆర్ చేసిన ఆరోపణలు వంద శాతం తప్పు. స్కాం లేదు, లంచం లేదు. ఎలుక కూడా దొరకని స్థితిలో, కొండ తవ్విన BRS ప్రచారం నవ్వులపాలు అయింది. ఇప్పుడు గత పదేళ్లలో ఇదే TGIIC ద్వారా గత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆస్తులు ఎన్ని తనఖా లోకి వెళ్లాయి ? ఎంత బాండ్స్ సేకరించారు? ఆ తనఖా పెట్టిన స్థలాలు తన వాళ్లు ఎవరు సెటిల్ అయ్యారు? అనే విషయాలు బయటకు వస్తాయి. తీస్తారు కూడా. అంటే కేటీఆర్ ఎంతో కష్టపడి చెట్టుకొట్టి మీద వేసుకున్నట్లే.