మత రాజకీయాల బారిన పడిన పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో చివరికి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అన్ని ఆధారాలతో పోలీసులు కేసును తేల్చేశారు. ఆయన రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని .. అది కూడా మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవ్ చేసి ప్రమాదం కొని తెచ్చుకున్నారని తేల్చారు. ఏలూరు రేంజ్ ఐజీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు.
పాస్టర్ ప్రవీణ్ సికింద్రాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభించినప్పటి నుండి చనిపోయి పడి ఉన్న ప్రాంతం వరకూ ఉన్న నాలుగు వందల సీసీ కెమెరాలను విశ్లేషించారు. దారి మధ్యలో నాలుగు సార్లు ప్రమాదానికి గురయ్యారు. ఓ సారి ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దారిలో మొత్తంగా నాలుగు సార్లు మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి యూపీఐ పేమెంట్లు చేశారు. ఓ టోల్ ప్లాజ్ వద్ద స్తంభానికి ఢీకొట్టి కిందపడిపోతే వైద్య సాయం కూడా నిరాకరించారు.
పాస్టర్ ప్రవీణ్ బైక్ పై రాజమండ్రికి బయలుదేరారని కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. బయలుదేరిన తర్వాత మాట్లాడిన ఫోన్లు, గత ఆరు నెలల నుంచి ఆయనకు ఎవరైనా బెదిరింపులు ఇచ్చారా వంటివి అన్నీ పోలీసులు పరిశీలించారు. కుటుంబసభ్యులు కూడా తమకు ఎవరిపై అనుమానం లేదని చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం బండి నాలుగో గేరులో ఉంది. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం ఆయన బాడీలో ఆల్కహాల్ ఉంది. అన్నీ చూసిన తర్వాత ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నిర్ధారించారు.
పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారంటూ మత రాజకీయం చేసిన ఎవరూ ఒక్క చిన్న ఆధారం కూడా ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.