కర్ణాటక ప్రభుత్వం కూడా కులగణన చేసింది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం చేయడానికన్నా ముందే చేసింది కానీ కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. రెండు రోజుల కిందటే కేబినెట్ భేటీలో ఆమోదించారు. ఇంకా అధికారికంగా వివరాలు బయటకు రాలేదు. కానీ అనధికారింగా మాత్రం లీక్ చేశారు. ఈ లెక్కల ప్రకారం కర్ణాటకలో బీసీల కన్నా ఎస్సీలే అత్యధికంగాఉన్నారు.
కర్ణాటకలో టాప్ ఫైవ్ కులాలుగా ఎస్సీలు, లింగాయత్‌లు, ఓబీసీలు, ముస్లింలు, వొక్కలిగలు ఉన్నారు. ఎస్సిలు కోటి ఎనిమిది లక్షల మంది ఉన్నట్లుగా కులగణనలో తేలిందని చెబుతున్నారు. ఇక రాజకీయంగా బలంగా ఉండే లింగాయత్‌లు 81 లక్షల మంది, ఓబీసీలు 77 లక్షలు, ముస్లింలు. 75, వొక్కలిగలు 73 లక్షలు, ఎస్టీలు 42 లక్షలు ఉన్నట్లుగా ప్రభుత్వం వైపు నుంచి సమాచారం లీక్ అయింది.
కర్ణాటకలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అహిందా గ్రూప్‌గా పిలుస్తారు. ఆ గ్రూపు జనాభా బాగా పెరిగిందని ఈ లెక్కల్లో తేలింది. ఈ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి ఆమోదించనున్నారు. అయితే కులగణన ప్రకారం రిజర్వేషన్లు కల్పించే తీర్మానాలు, చట్టాలు చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదు.