రెవిన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆర్పీ సిసోడియాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు టైక్స్ టైల్స్ శాఖ బాధ్యతలు ఇచ్చారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మికి అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయలక్ష్మి ఉన్నారు. AP HRD సంస్థ డైరెక్టర్‌గా కాటమనేని భాస్కర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం ఐటీ సెక్రటరీగా కూడా ఉన్నారు.
సాధారణంగా పూర్తి స్థాయిలో అధికార వ్యవస్థ ప్రక్షాళన జరిగినప్పుడు కీలక స్థానాల్లో ఉన్న వారిని మారుస్తారు. కానీ రెవిన్యూ శాఖ చూస్తున్న సిసోడియాను అనూహ్యంగా మార్చడంపై ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సిసోడియా కీలకంగానే ఉన్నారు. అయితే పలు కీలక అంశాల్లో ఆయన సరైన నిర్ణయం తీసుకోలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం దగ్గర నుంచి రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన పలు భూ స్కాంల విషయంలో చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ఇంత హఠాత్తుగా ఆయనను మార్చడానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదేమిటో టీడీపీ ఉన్నత స్థాయిలో వారికి.. అధికార వర్గాల్లో వారికే స్పష్టత ఉంటుంది.