విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 44 కిలోమీటర్ల ఈ రహదారి రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది. అలాగే దాదాపుగా నాలుగు కిలోమీటర్ల మేర పోర్టుకు కనెక్ట్ చేసే రహదారిని నిర్మిస్తున్నారు. విజయవాడ-మచిలీపట్నం మధ్య NH-65 జాతీయ రహదారి ఉంది. పోర్టు నిర్మాణం కారణంగా ఈ దారి మొత్తం రెసిడెన్షియన్, ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడుతోంది.
మచిలీపట్నం వెళ్లే దారిలో శివారు ప్రాంతాలు ఇప్పటికే రియల్ ఎస్టేట్ హాట్ కేకులుగా ఉన్నాయి. కంకిపాడు నుంచి పామర్రు వరకూ ఇప్పటి వరకూ వ్యవసాయ కేంద్రంగానే ఉంటోంది. జాతీయ రహదారి విస్తరణ పనులతో ఇళ్ల వెంచర్లు, ఇండస్ట్రీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. గుడివాడకూ ఈ రహదారి కలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పామర్రులో ఇటీవలికాలంలో స్థలాల ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయ భూములు రెసిడెన్షియల్ ప్లాట్లుగా మారుతున్నాయి. చదరపు గజానికి పది నుంచి పదిహేను వేల రూపాయల ధర పలుకుతోంది.
మచిలీపట్నంలో పెద్ద ఎత్తున ఇప్పటికే వెంచర్లు వేశారు. ఇక్కడ కూడా పదిహేను వేల వరకూ గజం ధర పలుకుతోంది. కొత్త గేటెడ్ కమ్యూనిటీలు, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులకు గన్నవరం, మచిలీపట్నం శివారు ప్రాంతాలు దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి రాబడిని ఇవ్వవచ్చుని నిపుణులు చెబుతున్నారు. గుడివాడ, పామర్రు వంటి ప్రాంతాల్లో సొంత ఇల్లు మధ్యతరగతికి అందుబాటులో ఉన్నాయి.
మౌలిక సదుపాయాలు పెరిగే కొద్దీ అక్కడ భూమిపై ధరలు కూడా అమాంతం పెరుగుతూ ఉంటాయి. అభివృద్ధికి ఉన్న అవకాశాలను బట్టి చూస్తే.. విజయవాడ- మచిలీపట్నం మధ్య ప్రాంతం ఎన్నో ప్లస్ పాయింట్లను కలిగి ఉంది.