వైఎస్ఆర్సీపీకి మరో ప్రత్యర్థి దొరికాడు. ఆయనే రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నానని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన అమలాపురంలో పర్యటించారు. కోడికత్తి శీను కుటుంబాన్ని పరామర్శించారు. అంతే వైసీపీకి ఆయనను మరోసారి గెలుక్కోవాలని అనిపించినట్లుగా ఉంది. వెంటనే ఓ పెద్ద కథనం రాసేశారు. జగన్ రెడ్డిపై కోడికత్తి శీను దాడి చేసినప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఏబీవీనే ఉన్నారు. జగన్ పై కోడికత్తి దాడి వెనుక ఆయన ఉన్నారని ఇదే సాక్ష్యమని.. ఆరోపించేసింది.
వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియాలో స్పందించారు. జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు గురించి, శీనుకు జరిగిన అన్యాయం గురించి, విచారణ గురించి మొత్తం చర్చించడానికి తాను రెడీ అయినా.. అది సాక్షి టీవీలో అయినా సరే సిద్ధమని ప్రకటించేశారు. సాక్షిలో వచ్చిన వార్తనే ప్రెస్మీట్లో చదివిన గడికోట శ్రీకాంత్ రెడ్డికి కూడా ఏబీవీ అదే సవాల్ విసిరారు. అయితే అవేమీ తెలియనట్లుగా సాక్షి నటిస్తోంది. ఎవరిపై ఆరోపణలు చేశారో వారే నేరుగా సవాల్ విసురుతూంటే్.. పట్టించుకోకుండా వన్ సైడ్ బురద చల్లడం వైసీపీకే చెల్లింది.
కోడికత్తి శీను వ్యవహారంలో ఏం జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA తేల్చింది. ప్రస్తుతం ముంబై దాడుల కేసులో కీలక సూత్రధారిగా ఉన్న తహవ్వూర్ రాణాను ఈ ఎన్ఐఏనే ప్రశ్నిస్తోంది. ఇలాంటి దిగ్గజ సంస్థ దర్యాప్తులో నిజాలు తేలలేదని జగన్ అంటారు. అసలు కేసు ఎన్ఐఏకు వెళ్లేలా చేసుకుంది జగన్ రెడ్డినే. తాను కోరుకున్న దర్యాప్తు రిపోర్టును తాను అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినా సరే ఆయన అంగీకరించకుండా.. సానుభూతి డ్రామాల కోసం .. ఇంకా ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కోడికత్తి , గులకరాయి అన్నీ.. ప్రజలకు లాఫింగ్ స్టాక్‌గా మారిపోయాయి. ఇప్పుడు ఏబీవీతో పెట్టుకున్నారు. ఆయన అసలు వివరాలు డిబేట్లో బయటపెడితే పరువు పోతుందని సైలెంట్ గా ఉంటున్నట్లుగా కనిపిస్తోంది.