ధోనీ రిటైర్ అయిపోతే బాగుణ్ణు, ఇంకెన్నాళ్లు ఆడతాడు? అనే విమర్శలకు ధోనీ తన ఆట తీరుతోనే బదులు ఇచ్చాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కీపర్‌గా, బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించాడు. వరుస ఓటములకు ఓ గెలుపుతో బ్రేక్ ఇచ్చాడు. చివరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ ఎంపిక అయ్యాడు.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. ఓ దశలో చెన్నై ఈ టార్గెట్ ని సునాయాసంగా ఛేదిస్తుందినిపించింది. అయితే వరుసగా వికెట్లు పడిపోతుండడంతో చెన్నైపై ఒత్తిడి పెరిగింది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతుందా? అంటూ అభిమానులూ ఆందోళన పడ్డారు. అయితే ధోనీ వచ్చి మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు. 11 బంతుల్లో 26 పరుగులు (4 ఫోర్లు, 1 సిక్స్) చేసి మ్యాచ్‌ని చెన్నై వైపు తిప్పేశాడు. అంతకు ముందు వికెట్ల వెనుక ధోనీ చాలా చురుగ్గా కదిలాడు. ఓ క్యాచ్ పట్టాడు. ఓ రనౌట్ చేశాడు. ఓ స్టంప్ అవుట్ చేశాడు. మొత్తానికి ధోనీ ఆల్ రౌండర్ ప్రదర్శన అభిమానులకు జోష్ ఇచ్చింది.
ఈ సీజన్లో చెన్నైకి ఇది రెండో విజయం మాత్రమే. 7 మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఇంకా చివరి స్థానంలోనే ఉంది. మిగిలిన మ్యాచ్‌లు చెన్నైకి చావో రేవో. ఇక నుంచీ ప్రతీ మ్యాచ్ గెలుస్తూ పోవాలి. లేదంటే ప్లే ఆఫ్ చేరుకోలేదు. ఈ విజయం చెన్నైకి స్ఫూర్తి నింపేదే. మిగిలిన మ్యాచ్‌లలో చెన్నై కింగ్స్ ఎలా రాణిస్తుందో చూడాలి.