క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఏమిటో తెలియకపోతే తీసుకునే నిర్ణయాలు విజయవంతం కావడం చాలా కష్టం. సమస్య పరిష్కారం కోసం తీసుకునే నిర్ణయాలు.. సమస్య గురించి తెలిస్తేనే ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని గుర్తించారు. పేదరికం లేని సమాజం కోసం ఆయన తీసుకు వచ్చిన P4 విధానంతో చాలా మార్పు తేవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఎక్కడికి వెళ్లినా పేద ప్రజల జీవితాలను పరిశీలిస్తున్నారు. వారితో మమేకం అవుతున్నారు. వారి కష్టాలు తీరాలంటే ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పథకాలతోనే జీవితాలు మారవు – ఇంకెంతో చేయాలి !
చాలా ప్రభుత్వాలు ప్రజల అకౌంట్లలో పదివేలు వేస్తే పనైపోతుందని అనుకుంటాయి.కానీ ఆ పది వేలకు మరో ఐదు వేలు కలిపి మళ్లీ వాళ్ల దగ్గరే వివిధ పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఇక వారి జీవితాలు బాగుపడేదెలా ?. వారి జీవితాలు బాగుపడాలంటే.. పథకాలు మాత్రమే సరిపోవు. అంతకు మించి చేయాలి. వారి ఆదాయ మార్గాలను పెంచాలి. వారిలో చైతన్యం పెంచాలి. తమ వృత్తి, వ్యాపారం విషయంలో మరింత మెరుగుపడేలా చేయూత అందించాలి. చంద్రబాబు ఆ దిశగా ఆలోచించారు. అందుకే తాను ఏ కార్యక్రమానికి వెళ్లినా ప్రతీ చోటా..నిరుపేదల జీవితాలను చూస్తున్నారు. వారి బాగు కోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వ్యక్తిగత సాయాల వల్ల వచ్చేది పబ్లిసిటీనే !
చంద్రబాబు తాను పరిశీలించిన వారి కుటుంబాలకు సాయం చేస్తున్నారు. ఇళ్లు లేకపోతే మంజూరు చేయిస్తున్నారు. ఆర్థికంగా సాయం చేసేందుకు ఆదేశాలు చేస్తున్నారు . ఇలా తాను పరిశీలించిన పేదలు జీవితాలు మారిపోయేలా చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఇలా చేయడం వల్ల ఆ ఒక్క కుటుంబమే బాగుపడుందని ఆయనకూ తెలుసు. కానీ సీఎం వస్తున్నారంటే.. తమ ఇంటికి లేదా..తమ దుకాణానికి వచ్చారంటే తమ రాతలు మారిపోతాయని అనుకుంటారు. వారిని నిరాశపరచకుండా సాయం చేస్తున్నారు. దాని వల్ల ప్రచారం లభిస్తోంది కానీ.. అది పబ్లిసిటీ కోసమే చేయడం లేదు.
ప్రజల్లో ఉంటే వారి జీవితాల్లో మార్పు తేవడం సులువే !
ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండాలి. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు రెడీగా ఉండేవారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇతర మనుషుల్లాగే ఆయన దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తారు కానీ ఎంతో దూరం అన్నట్లుగా మారిపోయారు. 2014-19 మధ్య అదే జరిగింది. ప్రజలతో కనెక్షన్ పోయింది. నిజానికి అప్పట్లో ప్రతి ఒక్కరికీ సమస్యలు వినేందుకు..పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థలు పెట్టారు. కానీ టెక్నాలజీ వల్ల మనుషులకు దగ్గర కాలేదని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రయత్నాల వల్ల ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.