తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని వారంతా వచ్చి ఎమ్మెల్యేలను కొనమని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన చెప్పుకొస్తున్నారు. ఎంత ఖర్చు పెట్టి అయినా ఎమ్మెల్యేలను కొనమని..తాము డబ్బులిస్తామని వారు చెబుతున్నారట. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరదని ఆయన సిద్ధాంతం కూడా చెబుతున్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఆషామాషీగా చేసిన వ్యాఖ్యలు అనుకోవడానికి అవకాశం ఉండదు. కేసీఆర్ కు ఆయన అత్యంత సన్నిహితుడు. కీలక విషయాల్లో కేసీఆర్ కొంత మందితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకరు. మెదక్ ఎంపీగా..ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడం గురించి ఎమ్మెల్యేల ను కొనుగోలు చేయడం గురించి మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ నేతలు ఇలాంటి ఆలోచనలు చేస్తారనే రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫిరాయింపులను ప్రోత్సహించారు. పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే వారు ఏ పార్టీనో తేల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వైల్డ్ ఆలోచనలకు వస్తోందని.. తమకు కావాల్సినంత డబ్బు పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు ఇస్తామంటున్నారని చెప్పడం కొత్త సంకేతాలు ఇవ్వడమే. దీనిపై రేవంత్ సర్కార్ చేతల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.