విజయానికి వందమంది తండ్రులు. ఓటమి మాత్రం అనాథ. సినిమా ఫ్లాప్ కూడా అంతే. హిట్ అయితే క్రిడిట్ లాక్కోవడానికి అంతా ముందుకు వస్తారు. ఫ్లాప్ అయితే మాత్రం ఎవరి దారి వాళ్లు చూసుకొంటారు. ఇటీవల కొన్ని పరాజయాలు ఇండస్ట్రీని బాగా ఇబ్బంది పెట్టాయి. ఫ్లాప్స్ వస్తే డిస్టిబ్యూటర్లు నిర్మాత వెంట, నిర్మాత హీరో వెంట పడడం రివాజు. ఈసారీ అదే జరుగుతోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్లో అరడజను సినిమాలకు సంబంధించిన పంచాయితీ జరుగుతోంది. డిస్టిబ్యూటర్లేమో ‘మేం మీ సినిమాని కొని నష్టపోయాం. ఎంతో కొంత వెనక్కి ఇవ్వాల్సిందే’ అంటూ నిర్మాతపై ఫిర్యాదు చేస్తే, ఆ నిర్మాత ఏమో `హీరోని నమ్మి సినిమా తీశాం. భారీగా రెమ్యునరేషన్ ఇచ్చాం. ఇప్పుడు నష్టాలొస్తే హీరోదే బాధ్యత కదా, హీరోనే పారితోషికం తిరిగి ఇవ్వాలి` అని ఆయా హీరోలపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ పంచాయితీలే నడుస్తున్నాయి.
ఇటీవల ఓ మీడియం రేంజ్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హీరో గారికి రూ.12 కోట్ల పారితోషికం ఇచ్చారు. నిజానికి ఈ సినిమా ఒప్పుకొనేముందు ఆ హీరోకి అంత క్రేజ్ లేదు. లేటెస్ట్ సినిమా హిట్టయ్యిందని చెప్పి, పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. హీరో క్రేజ్‌ని క్యాష్ చేసుకొనే ఉద్దేశంలో నిర్మాత కూడా అడిగినంత ఇచ్చాడు. సినిమా కూడా భారీగా తీశారు. అయితే.. కనీసం ఓపెనింగ్స్ కూడారాలేదు. రూపాయికి రూపాయి పోయినట్టే. అందుకే ఇప్పుడు ఆ హీరో మీద పడ్డాడు నిర్మాత. ‘నిన్ను చూసే కదా, ఇంత పెట్టుబడి పెట్టింది. ఎంతోకొంత తిరిగి ఇవ్వాల్సిందే’ అంటూ పంచాయితీకి వచ్చాడు. హీరో మాత్రం దీనిపై స్పందించడం లేదు. ఛాంబర్లో నడిచే పంచాయితీల్లో ఎక్కువ శాతం యువ హీరోలపైనే. వీటిపై పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది.