ఏపీ లిక్కర్ స్కాంలో సీఐడీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి ఆయన వైసీపీ మాజీ ఎంపీ, మద్యం స్కాంలోనూ కీలక పాత్రధారిగా భావిస్తున్న విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల పద్దెనిమిదో తేదీన హాజరు కావాలని సీఐడీ సిట్ నోటీసుల్లో ఆదేశించింది. విజయవాడ సీపీ కార్యాలయంలో ఆయన హాజరు కావాల్సి ఉంది.
ఇప్పటికే లిక్కర్ స్కామ్లో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి మీడియా ముందే తెలిపారు. ఈ క్రమంలో సిట్ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన పరారీలో ఉన్నారు. కోర్టు నుంచి ఊరట లభించకపోయినప్పటికీ ఆయన పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. రాజ్ కసిరెడ్డి మద్యం స్కాంలో సంపాదించిన డబ్బులను ఎక్కడెక్కడ పెట్టుబడిగా పెట్టారు.. ఏ ఏ ఆస్తులను కొనుగోలు చేశారో కూడా సీఐడీ అధికారులు తేల్చారు.
గతంలో కాకినాడ. పోర్టు వ్యవహారంలో సీఐడీ ఎదుట హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి … లిక్కర్ స్కాం గురించి తనకు నోటీసులు ఇస్తే మొత్తం చెబుతానని చెప్పారు. ఇప్పుడు ఆయన బయట పెట్టాల్సి ఉంది. నిజానికి అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడిది. లిక్కర్ స్కాంలో ఆ కంపెనీ పాత్ర కూడా కీలకమే. ఇప్పుడు ఆయన నిందితుడు అవుతారా.. అప్రూవర్ అవుతారా అన్నది తేలాల్సి ఉంది.