బీఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాను కాస్త రౌడీ టైప్ అని హెచ్చరికలు జారీ చేశారు. వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగసభ కోసం సన్నాహాల సమావేశాలు నిర్వహిస్తున్న ఆమె.. బాన్సువాడలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని.. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని హెచ్చరించారు.
బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు ..కేసులు పెట్టించే పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేసీఆర్ మంచోడనేనని తానే కాస్త రౌడీ టైప్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదు.. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదన్నారు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరు ఇక్కడ అని హెచ్చరించారు.
మిగతా డైలాగులన్నీ రొటీన్ గా చెప్పేవేమో కానీ.. తాను కాస్త రౌడీ టైప్ అని కవిత చెప్పేసరికి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలి కాలంలో ఏ బీఆర్ఎస్ నేత కూడా పెద్దగా పట్టించుకోని పింక్ బుక్ విషయాన్ని కవిత మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు తాను రౌడీనే అనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.