ఆంధ్ర ప్రదేశ్ విమాన ప్రయాణికులకు మాత్రమే ఎదురవుతుతున్నవిచిత్రమైన అనుభవం ఇది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని వైజాగ్ నుండి అదే రాష్ట్ర పరిపాలనా రాజధాని అమరావతి చేరాలంటే పొరుగు రాష్ట్రం తెలాంగాణా రాజధానికి రావాల్సిందే. హైదరాబాద్ నుండి విజయవాడకు విమాన ప్రయాణం చేయాల్సిందే. ఇలా రెండు సార్లు మారి ప్రయాణాలు చేయడం వలన వైజాగ్ నుండి అమరావతి రావాలనుకున్న ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఈరోజు ఆ బాధను ట్విటర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం ఉన్న సమావేశానికి తాను హాజరు కావాల్సి ఉందనీ, ఆ క్రమంలో వైజాగ్ నుండి హైదరాబాద్ కు, హైదరాబాద్ నుండి విజయవాడకు నుండి రెండు సార్లు మారి మరీ ప్రయాణం చేయాల్సి వచ్చిందనీ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
తనతో పాటూ విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందనీ చెప్పుకుంటూ వచ్చారు. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి , నారా లోకేష్ గారికి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ట్యాగ్ చేస్తూ తన బాధను వెళ్లబుచ్చారు. సాక్షాత్త్తూ ఆ రాష్ట్రానికి, ఆయన ఉన్న పార్టీకే చెందిన రామ్మోహన్ నాయుడు గారే కేంద్ర విమానశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గంటా చెప్తున్నట్టు విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితిని అర్ధం చేసుకొని ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.