మంత్రి పదవుల గురించి మాట్లాడితే మీకే నష్టమని.. హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలను హెచ్చరించారు. శంషాబాద్ నోవాటెల్ లో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలు అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో మంత్రి పదవుల ప్రస్తావన వచ్చింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై రేవంత్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. పలువురు పేర్లను ప్రచారంలోకి తెస్తున్నావని అది మంచిది కాదన్నారు. మంత్రి పదవుల విషయంలో హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని ఎవరూ మాట్లాడవద్దని..ఎవరైనా మాట్లాడితే అది వారికే నష్టమన్నారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు వీకెండా పాలిటిక్స్ చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లడం లేదని.. నియోజకవర్గాలకు వారాంతంలోనే వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. జూన్ రెండో తేదీ వరకూ పర్యటించాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సన్నబియ్యం పథకానికి మంచి ఆదరణ వస్తోందన్నారు.
రెండో సారి గెలవడానికి నియోజకవర్గాల్లో ఏ ఏ పనులు అవసరమో వాటిని లిస్టవుట్ చేసుకుని వస్తే వాటిని తాను చేసి పెడతానన్నారు. ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ల ఇస్తానని కూడా భరోసా ఇచ్చారు. సీఎల్పీ సమావేశం ఎజెండా ఏమిటో కానీ.. ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశంపైనే ఎక్కువగా మాట్లాడారు. మంత్రి పదవులపై మాట్లాడవద్దని సలహా ఇచ్చారు.