తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు డైమండ్ జూబ్లీ అంటే 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో విదేశాల్లోనే ఆ వేడుకలను చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పదహారో తేదీన ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు అక్కడి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు. వజ్రోత్సవ జన్మదినోత్సవాన్ని పూర్తిగా కుటుంబసభ్యులతోనే గడపనున్నారు.
చంద్రబాబునాయుడు రాజకీయ జీవితంలో పుట్టిన రోజులు కూడా ఎప్పుడూ కుటుంబంతో గడప లేదు. కానీ ఇప్పుడు మాత్రం 75వ పుట్టిన రోజును మనవడితో సహా కుటుంబసభ్యులు అందరి సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించారు. 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కుటుంబానికి సమయం కేటాయించడం ప్రారంభించారు. అంతకు ముందు ఆయన పరిపాలనలో.. ప్రజల్లోనే ఎక్కువగా ఉండేవారు. 2019 తర్వాత మెల్లగా కుటుంబానికి సమయం పెంచారు. వీకెండ్స్ లో కుటుంబంతో గడుపుతున్నారు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారానికి ఒక్క రోజు అయినా కుటుంబంతో గడుపుతున్నారు. కుటుంబ కార్యక్రమాలకూ హాజరవుతున్నారు. నారా రోహిత్ ఎంగేజ్మెంట్కు కూడా హాజరయ్యారు. మొత్తంగా చంద్రబాబు కుటుంబానికీ కొంత సమయం కేటాయిస్తూ ఉండటంతో.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ముఖ్యమైన వేడుకల్ని కలిసి చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సారి చంద్రబాబు పుట్టిన రోజును కుటుంబం అంతా కలసి చేసుకోనుంది.