అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. తమ దేశం నుంచి అన్ని దేశాలు దోచుకుతింటున్నాయని అనుకుంటారు. కానీ అన్ని దేశాలు తమ దేశాలను అమెరికానే దోచుకుని అలా బాగుపడిందని అనుకుంటాయి. ప్రపంచ కరెన్సీగా డాలర్‌ను పెట్టుకుని చేయకూడని ఆర్థిక నేరాలు అమెరికా చేస్తోందని చాలా మంది అనుకుంటారు. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు అదే అమెరికా అన్ని దేశాలను తమ దారికి తెచ్చుకునేందుకు సుంకాల పేరుతో భయపెడుతోంది. చైనానూ అలాగే చేయాలని అనుకుంది.కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది. ఎంతగా అంటే.. చైనాతో పెద్ద డీల్ కుదుర్చుకుంటామని అమెరికా చెబుతోంది.
ఎంత పన్నులేసినా అమెరికాకు చైనా వస్తవులు ఆగవు.. దానికో రూట్ !
అమెరికా మీద చైనా ఎక్కువగా ఆధారపడలేదు. చైనాకు అమెరికా ఓ పెద్ద మార్కెట్. అయితే వందల శాతం పన్నులు వేసి చైనా వస్తువులు అమెరికా రాకుండా చేయాలని ట్రంప్ అనుకుంటున్నారు. దాని వల్ల అమెరికా ప్రజలు నష్టపోతారు. అది వేరే విషయం కానీ.. చైనా వస్తువులు అమెరికా రాకుండా ఆపగలరా?. సాధ్యమయ్యే చాన్సే లేదు. చైనా కొంత నష్టానికి అయినా.. తమ వస్తువులను ఇతర దేశాలు అంటే.. ట్రంప్ తక్కువ పన్నులు వేస్తున్న దేశాలకు పంపించి.. అక్కడి నుంచి ఆ దేశం ముద్ర వేసి..అమెరికాకు పంపుతారు. అమెరికాకు వాటిని స్వీకరించడం తప్ప మరో మార్గం ఉండదు. అంటే చైనా వస్తువులు ఎలాగైనా అమెరికాకు చేరుతారు.
చైనా ఎగుమతులు ఆపేస్తే అమెరికాకు గడ్డు పరిస్థితి !
మరో వైపు చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అత్యంత కీలకమైన ఖనిజాలు.. చైనాలో మాత్రమే లభ్యమయ్యే వనరులను ఎగుమతి ఆపేస్తే అమెరికాకు ఊపిరి ఆడదు. ఇప్పుడు అదే జరుగుతోంది. అమెరికాకు ఎగుమతి అయ్యే అత్యంత అరుదైన ఖనిజాలను ఆపేయాలని చైనా నిర్ణయించింది. ఇవి అమెరికాలో ఎలక్ట్రానిక్స్ , యుద్ధ పరికరాలు సహా అనేక కీలక వస్తువుల తయారీలో కీలకం. ఇవి లేకపోతే అమెరికాకు కష్టంగా మారుతుంది. ఇవి మాత్రమే కాదు..ఇంకా చాలా .. చైనాలో మాత్రమే లభ్యమయ్యే వస్తువుల ఎగుమతుల్ని చైనా ఆపేయాలని అనుకుంటోంది.
పెద్ద డీల్ కుదురుతుందంటున్న అమెరికా
పరిస్థితులు రివర్స్‌లో మారుతున్నట్లుగా కనిపిస్తూండటంతో పెద్ద డీల్ కుదురుతుందని.. అమెరికా ఆశ పడుతోంది. గతంలో చాలా దేశాలు ట్రంప్ వేసిన సుంకాలపై చర్చలకు సిద్ధమని ప్రకటించాయి. కానీ చైనా మాత్రం రివర్స్ సుంకాలతో.. కొరడా ఝుళిపించింది. ఎగుమతుల్ని ఆపేసింది. దీంతో అమెరికానే.. చైనాతో చర్చలకు సిద్ధమని అంటోంది. ఇప్పుడు చైనాకు తల వంచినట్లయింది. ఈ పరిస్థితి అమెరికానే తెచ్చుకుంది. ట్రంపే తెచ్చి పెట్టారు.