ఏపీ లిక్కర్ స్కాంలో సాక్షిగా విజయసాయిరెడ్డి హాజరు కావాలని సీఐడీ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే లిక్కర్ స్కాంలో ఆయన సాక్షి అని చెప్పడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే ఇప్పుడంటే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లుగా నాటకాలు ఆడుతున్నారు కానీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు .. ఏ ఏ రంగాల్లో ఎలా దోచుకోవాలో అనే మాస్టర్ ప్లాన్ రూపకర్తల్లో ఒకరు విజయసాయిరెడ్డి. ఎలా దోచుకోవాలి.. ఎలా డబ్బులు రూటింగ్ చేయాలన్నది విజయసాయిరెడ్డి కన్నా అనుభవం ఎవరికి ఎక్కువ ఉంటుంది ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉండి అప్రూవర్‌గా మారిన తన అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డితో కలిసి అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీని పెట్టించి భారీగా లిక్కర్ ను అమ్మించాడు. పెద్దఎత్తున లాభాలను పొందాడు. అదాన్ డిస్టిలరీస్ కు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి..సీఐడీ వద్ద ఉన్నాయి. అల్లుడి పేరు పెట్టి దోపిడీకి స్క్రీన్ ప్లే రాసింది విజయసాయిరెడ్డినే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన వాటాను ఆయన పొందారన్నమాట.
వైసీపీ హయాంలో ప్రతి స్కాంలోనూ విజయసాయిరెడ్డికి వాటా ఉంటుందని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన ఏదో పొలిటికల్ గేమ్ ప్లే చేస్తూ ఉండవచ్చు కానీ.. ఆయనను సాక్షిగా పరిగణనలోకి తీసుకుంటే మాత్రం సాక్షి పత్రికలో వచ్చే కథలనే వినిపిస్తారు. సీఐడీ అధికారులు ఆయన చెప్పే విషయాలను నమ్ముతారా లేకపోతే..అయననూ నిందితుడే అన్న కోణంలో చూస్తారా అన్నదే కీలకం. అలా కాకుండా అంతా నిజమే చెబితే అప్పుడు కూడా ఆయన సాక్షి కాదు .. అప్రూవర్ అవుతారు.