ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 9వ తేదీన ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఒక్క స్థానానికి కనీసం నామినేషన్ వేసేంత బలం కూడా వైసీపీకి లేదు కాబట్టి పోటీ ఉండదు. కూటమికే ఆ స్థానం దక్కనుంది. అభ్యర్థిని ఖరారు చేయడానికి 29 వ తేదీ వరకూ సమయం ఉంది కాబట్టి అప్పటి వరకూ ఆ స్థానానికి ఎవరు పోటీ చేస్తారు.. ఏ పార్టీకి చాన్స్ దక్కుతుందన్నది సస్పెన్స్ గానే ఉండనుంది.
విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన బీజేపీలో చేరుతారని అదే స్థానం నుంచి మళ్లీ ఎన్నికవుతారని కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటి అవకాశాలు దాదాపుగా లేవని.. అవన్నీ వీసారెడ్డి క్యాంపు చేయించుకుంటున్న ప్రచారమని అనుమానిస్తున్నారు.
బీజేపీ ప్రోద్భలంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని భావిస్తున్నందున ఆ స్థానం బీజేపీకి ఇస్తారని అంటున్నారు. ఇప్పటికే ఓ రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చారు. మరో సీటును ఇవ్వడం కష్టమని అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ పట్టుబడితే చంద్రబాబు కూడా కాదనే పరిస్థితి లేదు. ఇప్పటికే బీజేపీ తరపున కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. టీడీపీ, జనసేన తరపున ఎవరి పేర్లూ ఇంకా ప్రచారంలోకి రాలేదు.