పేగు తెంచుకొని పుట్టిన కొడుకు తండ్రి మరణం ముంగిట బాధ్యతకు వెల కట్టాడు. ఆస్తి రాసిస్తేనే అంతిమ సంస్కారాలు చేస్తానని మానవత్వాన్ని మరిచాడు. తండ్రి త్యాగాన్ని చిన్నబోయేలా చేశాడు..చివరికి ధారాపాతంగా కురుస్తున్న కన్నీళ్లతో చిన్న కుమార్తె ఆ తండ్రికి అసలైన కుమారుడుగా మారింది. తనే అంతిమ సంస్కారాలు నిర్వహించి, అన్నయ్య మానవత్వం చంపేసిన చోటే ఆ మానవత్వానికి ప్రాణం పోసింది.
డబ్బు వ్యామోహమో , మారుతున్న కాలమో.. మనిషికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత డబ్బుకు ఇస్తున్న దశకు లోకం వేగంగా చేరుకుంది. కన్నవారి పట్ల కూడా కర్కశంగా వ్యవహరిస్తూ మానవత్వం అనే పదానికి మచ్చ తెస్తున్నా ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి.వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన మాణిక్య రావుకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన మాణిక్య రావు పిల్లల పెళ్లిళ్లు చేశాడు. భార్యను కోల్పోయిన తర్వాత మిగిలిన జీవితాన్ని తన పిల్లల మధ్య సంతృప్తిగా గడపాలనుకున్నాడు. తనకు ఉన్న ఆస్తిలో కొడుకు గిరీష్ కు 15 ఎకరాల భూమి, 60 లక్షల నగదును ఇచ్చాడు. మహబూబ్ నగర్ లో ఉన్న ఇంటిని ఇద్దరు కుమార్తెల పేరుపై రిజిస్టర్ చేశాడు. అయితే, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న మాణిక్య రావు మంగళవారం కన్నుమూశారు. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ లో ఉన్న అన్నయ్య గిరీష్ కు చెల్లెళ్లు సమాచారం అందించారు.తండ్రికి తలకొరివి పెట్టాల్సిన కుమారుడు రావడానికి నిరాకరించాడు.మహబూబ్ నగర్ లో ఉన్న ఇల్లు తన పేరిట రాస్తేనే వస్తానని చెప్పడంతో బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తండ్రికి తలకొరివి పెట్టాల్సిన కుమారుడు శవాన్ని కూడా చూసేందుకు రాలేదు.
కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తల కొరివి పెడతానని తండ్రి శవంతో బేరం ఆడాడు. బంధవులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా .. ఆస్తి ఇస్తేనే అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పాడు. దీంతో చివరికి చిన్న కుమార్తె రాజనందిని అంతిమ సంస్కారాలు చేసి కొడుకుగా మారింది. ఈ ఘటన అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఎన్నో హృదయాలను బరువెక్కించింది. అక్కడి నుంచి భారమైన హృదయంతో సెలవు తీసుకునేలా చేసింది.