రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో నేతలు ఒకరిని మించి ఒకరు రాటుదేలిపోవాలని అనుకుంటారు. ఎవరు అధికారంలో ఉంటే వారిదే రాజ్యం. ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది.. బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి గెలిచారు. ఇంకేముంది జమ్మలమడుగు నియోజకవర్గంలో అంతా ఆయన చెప్పినట్లే నడవాలి. వినని వారికి పనులు జరగవు.
జమ్మలమడుగులో సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఆ సిమెంట్ కంపెనీల్లో రకరకాల పనులు ఉంటాయి. ఆ పనులు చేయడానికి ఇప్పటికే ఆయా కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ రద్దు చేసుకుని తమ వారికి అప్పగించాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కొన్ని కంపెనీలు.. పనుల్ని ఆదినారాయణరెడ్డి వర్గీయులకు ఇచ్చాయి. కొన్ని పనులకు కాంట్రాక్టులు కొనసాగుతూండటంతో.. అవి అయిపోయాక ఆలోచిస్తామని అంటున్నాయి. కానీ ఆదినారాయణ రెడ్డి మాత్రం తగ్గడం లేదు.
ఇప్పుడు జమ్మలమడుగులో ఉన్న సిమెంట్ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపోయే పరిస్థితి వచ్చింది. ముడి సరుకులు సిమెంట్ ప్లాంట్లకు పోనివ్వకుండా రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి పక్కన చెట్టు కింద ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూర్చున్నారు. ఎవరైనా దాన్ని కదిలించలేరు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఏమీ చేయలేక ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చారు. మరో వైపు మీడియాకూ సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో ఆదినారాయణరెడ్డి వ్యవహారం వివాదాస్పదం అవుతోంది.
ఇంతకు ముందు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డితో గొడవ పడ్డారు ఆదినారాయణరెడ్డి, ఫ్లైయాష్ తీసుకెళ్లే వాహనాల విషయంలో ఈ వివాదం చెలరేగింది. ఇప్పుడు కొత్తగా ఇతర వివాదాలూ వస్తున్నాయి. రాయలసీమలో పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి ఇలాంటి దందాలు పెద్ద మైనస్ గా మారుతున్నాయి. అయితే ఆదినారాయణరెడ్డి మాత్రం ఆ కాంట్రాక్టులన్నీ వైసీపీ నేతల దగ్గర ఉన్నాయని ఆరోపిస్తున్నారు.