కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ గా ఎంపిక చేసింది. 40 ఏళ్ల లోపు వయస్సు ఉండి.. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన యువకులకు ఈ అవార్డు ఇస్తారు. ప్రపంచ అభివృద్ధికి కృషి చేసినందుకు వారిని గౌరవిస్తారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇండియా నుంచి మరో ఆరుగురు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కానీ అందరిలోకెల్లా రామ్మోహన్ నాయుడు ప్రత్యేకం.
రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ లో ప్రసంగిస్తే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రసంగంలో ఎక్కడా చిన్న తడబాటు ఉండదు. చెప్పాలనుకున్నది.. సూటిగా స్పష్టంగా చెబుతారు. అది ఏ భాష అయినా సరే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లలో ఆయన చెప్పాలనుకున్నది అందరికీ అర్థమయ్యేలా దేశ వ్రజల ముందు పెడతారు. తన విధుల పట్ల స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఆయన సొంతం.
రామ్మోహన్ నాయుడు రుద్దిన వారసత్వ రాజకీయ నాయకుడు కాదు. తండ్రి చనిపోవడంతో హఠాత్తుగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అప్పటి వరకూ ఆయనకు చదువులే లోకం. రాజకీయాల గురించి ఏమీ తెలియదు. కానీ ఎర్రన్న వారసత్వం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఇమేజ్ ముందు తేలిపోతారేమో అని అనుకున్నారు. కానీ ఆ బరువును చాలా సునాయాసంగా మోసి.. తండ్రిని మించిన తనయుడు అని అనతికాలంలోనే మెప్పించారు.
కేంద్ర మంత్రివర్గంలో ఇప్పుడు అతి చిన్న వయస్కుడు రామ్మోహన్ . ఆయన నిబద్ధత, నిజాయతీ, సమర్థత రాజకీయాల్లో లాంగ్ ఇన్నింగ్స్ కు కారణం అవుతాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇలాంటి యువ నేతలకు ఎన్నో అవకాశాలు వస్తాయి. రామ్మోహన్ ఏ స్థాయికి వెళ్తారో అంచనా వేయలేం కానీ ఆయన దేశానికి విలువైన సేవలు అందిస్తారని మాత్రంగా గట్టిగా చెప్పుకోవచ్చు.