తెలంగాణలో మందుబాబులకు మరోసారి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే బీర్ల ధరలను పెంచగా..మరికొద్ది రోజుల్లో లిక్కర్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, చీప్ లిక్కర్ కు మాత్రం ధరల పెంపు నుంచి మినహాయింపు ఉండనున్నట్లు సమాచారం.
బీర్ల ధరలను ఇప్పటికే 15శాతం పెంచగా…త్వరలో లిక్కర్ పై కూడా 10 నుంచి 15 శాతం ధరలను పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ధరల పెంపుపై ప్రభుత్వంతో బేవరేజెస్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు కానీ, అధికారిక వర్గాలు మాత్రం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రభుత్వం కూడా ప్రస్తుతం కొత్త మద్యం కంపెనీల సరఫరాపై సమీక్ష చేస్తుండటంతో ఈ విషయంపై స్పష్టత లేకుండా పోయింది.
500 కంటే ఎక్కువగా ఉన్న లిక్కర్ పై 10 నుంచి 15 శాతం ధరలు పెంచితే ఒక్కో బాటిల్ పై 50 నుంచి 75 రూపాయలు పెరగనుంది. అయితే, వెనువెంటనే మద్యంపై ధరలు పెంచితే ఎలాంటి రియాక్షన్ ఉండనుంది అని సర్కార్ సమాలోచనలు జరుపుతోంది.
మరోవైపు పెంచిన బీర్ల ధరలతో 3 శాతం బీర్ల అమ్మకాలు తగ్గగా…2శాతం లిక్కర్ అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు.