భూమిపై పెట్టే పెట్టుబడికి ఢోకా ఉండదని నమ్మకం. అయితే అత్యధిక రిటర్న్స్ ఇచ్చే చోట్ల పెట్టుబడి పెట్టడం ఓ కళ. అలాంటి ప్రదేశాలను కనుక్కోవడమే అసలు ట్రిక్. ఇలాంటి స్థలాల్లో ఒకటి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పరిటాల. 65వ నెంబరు జాతీయరహదారిపై ఉన్న పరిటాల విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిపాదిత అవుటర్ రింగ్ రోడ్డు , ఇన్నర్ రింగు రోడ్డు కు మధ్యలో ఉంటుంది.
అమరాతి నిర్మాణంతో పరిటాల గ్రామం రూపు రేఖలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడుపరిటాలపై దృష్టి పెట్టారు. కానీ భూములు అమ్మేందుకు అక్కడి యజమానులు రెడీగా లేరు. రికార్డు స్థాయిలో ఎకరం ఐదు కోట్లకు చేరినట్లుగా రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు అనూహ్యంగా పెరుగుతూండటంతో చాలా మంది యజమానులు వేచి చూడాలని అనుకుంటున్నారు. పిల్లల చదువులు, అప్పుల భారం, ఇతరత్రా ఆర్ధిక అవసరాల నిమిత్తం తప్పని పరిస్థితుల్లో కొద్దిమంది మాత్రమే తమ భూములను విక్రయిస్తున్నారు. లభ్యత తక్కువగా ఉండటంతో రేట్లు ఇంకా పెరుగుతున్నాయి.
ఎర్రుపాలెం-అమరావతి రైల్వే లైనులో బాగంగా భారీ కార్గో టెర్మినల్‌ను ఇక్కడే నిర్మించే అవకాశం ఉంది. ప్రధాన పోర్టులకు అనుసంధానించనున్నారు. రిలయన్స్ ఆధ్వర్యంలో కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న బయో ఎనర్జీ ప్లాంట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మౌలిక సదుపాయాలు పరిటాలలో పెరుగుతున్నాయి. ఈ కారణంగా వచ్చే రోజుల్లో పరిటాల భారీ రియల్ ఎస్టేట్ హాట్ ప్రాపర్టీగా మారనుందని అంచనా వేయవచ్చు.