ఒకప్పుడు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు చాలా చైతన్యవంతంగా ఉండేవి. వాటి ప్రేరణతో కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా అటువంటి మహిళా సంఘాలు ఏర్పాటు అయ్యాయి. కానీ వాటికి ప్రేరణ ఇచ్చిన డ్వాక్రా సంఘాలు నేడు దయనీయమైన స్థితిలో ఉన్నాయి. అందుకు కారణం ఎన్నికలలో వాటి రుణాల మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని నిలబెట్టుకోకపోవడమేనని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మావతి ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు ఏడు లక్షలకి పైగా డ్వాక్రా సంఘాలు ఉంటే, ఒకప్పుడు వాటిలో సగానికి పైగా ఏ-1 గ్రేడులో ఉండేవని, ఇప్పుడు వాటిలో చాలా వరకు సి గ్రేడుకి దిగజారిపోయాయని ఆమె ఆరోపించారు.
డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఎంపిక చేసిన కొన్ని సంఘాలకి కేవలం రూ.3,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేసి మహిళలని మోసం చేశారని ఆమె ఆరోపించారు. రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేయడంతో ఇప్పుడు డ్వాక్రా మహిళలకి బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నారని ఆ కారణంగా వారు తప్పనిసరి పరిస్థితులలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దకి వెళ్లి వారి కబంధ హస్తాలలో చిక్కుకుపోతున్నారని వాసిరెడ్డి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే విజయవాడలో కాల్ మనీ వ్యాపారాలు మొదలయ్యాయని, వాటిలో అత్యధిక శాతం అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు,స్నేహితులు, బంధువులే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు వాటి కారణంగానే అనేక మంది మహిళలు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నారని వాసిరెడ్డి పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ హామీ కారణంగానే డ్వాక్రా వ్యవస్థ కుప్పకూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి గోడు ఆలకించి తక్షణమే డ్వాక్రా రుణమాఫీ చేయాలని లేకుంటే మహిళలు క్షమించరని అన్నారు.
తెదేపా అధికారంలోకి రావడం కోసమే రుణమాఫీ హామీని ప్రకటించదన్న వైకాపా వాదనలో అబద్దం లేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని నిలబెట్టుకొని ఉండి ఉంటే తెదేపాకే ప్రజలలో మంచిపేరు వచ్చి, వారికి మరింత దగ్గరయ్యేది. కానీ విభజన కారణంగా ఎదురవుతున్న ఆర్ధిక సమస్యల వలన ఆ హామీని నెరవేర్చలేకపోయింది. ధనిక రాష్ట్రమైన తెలంగాణాయే ఆ హామీని నెరవేర్చలేక ఆపసోపాలు పడుతుంటే, ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ అన్ని లక్షల కోట్లు తీర్చగలదని ఆశించడం పొరపాటు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వలన ప్రస్తుతం తెదేపాకి కలిగే నష్టం, భయం ఏమీ లేదు కానీ చక్కగా నడుస్తున్న డ్వాక్రా వ్యవస్థ కుప్పకూలిపోయింది. కనుక దానిని మళ్ళీ లేపి నిలబెట్టవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే. లేకుంటే డ్వాక్రా మహిళలతో సహా రుణమాఫీ హామీ కారణంగా దెబ్బతిన్న వారందరూ వచ్చే ఎన్నికలలో తెదేపాకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయం. రుణమాఫీలు చేసేశామని తెదేపా నేతలు ఆత్మవంచన చేసుకొంటే దానివలన వారే నష్టపోతారు.