తెలంగాణ ముఖ్యమంత్రితో కూడిన అధికార బృందం జపాన్లో పర్యటిస్తోంది. మెట్రో రైలుకు రుణాలతో పాటు పలు సంస్థల పెట్టుబడుల ప్రణాళికలకు అక్కడ ఒప్పందాలు చేసుకుంటున్నారు. దావోస్లో అయినా.. అమెరికా పర్యటనలో అయినా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే తామే ఇన్ని పెట్టుబడులు తెచ్చామని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఆ క్రెడిట్ వాళ్లదే. ఎదుకంటే ప్రభుత్వం వారిది. కానీ అసలు ఈ పెట్టుబడుల సూపర్ పవర్ మాత్రం.. జయేష్ రంజన్ ఐఏఎస్.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉంటే జయేష్ రంజన్ అక్కడ ఉండేవారు. ఆయన ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రిస్, కామర్స్ విభాగాలను సుదీర్ఘంగా చూస్తున్నారు. పెట్టుబడులను ఎలా ఆకర్షించాలో జయేష్ కు బాగా తెలుసని చెబుతారు. పారిశ్రామిక వర్గాలతో ఉన్న మంచి సంబంధాలు.. ఆయన కార్పొరేట్ స్టైల్ వర్కింగ్ పెట్టుబడి దారులను కూడా ఆకట్టుకుంటాయి. అదే సమయంలో పారిశ్రామికవర్గాలు ఏం కోరుకుంటాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ, ఇన్నోవేషన్ పాలసీ స్టార్టప్ ఫ్రెండ్లీ పాలసీల రూపకల్పనల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడుతున్నాయి.
దేశ, విదేశీ పెట్టుబడిదారులతో జయేష్ మంచి సంబంధాలు కలిగి ఉంటారు. ఐటీ, ఫార్మా, బయోటెక్, మాన్యుఫాక్చరింగ్ దిగ్గజాలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరించడంలో జయేష్ రంజన్ పాత్ర కీలకం. ఇన్వెస్టర్ సమ్మిట్లు , వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వంటి వేదికలలో తెలంగాణను ప్రమోట్ చేయడంలో జయేష్ ది ప్రత్యేక శైలి. హైదరాబాద్కు ఉన్న ప్లస్ పాయింట్లను ఉపయోగించుకుని ఇన్వెస్టర్లను ఆకర్షిస్తారు. ఆయా దేశాల పర్యటనలకు ముఖ్యమంత్రి బృందం బయలుదేరక ముందే.. అక్కడ ఎంవోయూల ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తారు.
జయేష్ రంజన్ కు ప్రస్తుతానికి తెలంగాణ సర్కార్ లో ప్రత్యామ్నాయం లేదు. అందుకే కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడని ముద్రపడినా రేవంత్ ఆయన ను కదిలించే ప్రయత్నం చేయలేదు. జయేష్ కూడా ప్రభుత్వం ఎవరిదన్నది కాకుండా .. తన బాధ్యత తాను నిర్వహిస్తున్నారు.