సదావర్తి సత్రం భూముల కుంభకోణం గురించి కొన్ని రోజులు హడావుడి చేసిన వైకాపా ప్రస్తుతం గడప గడపకీ తిరుగుతున్నందున క్షణం తీరిక లేకుండా ఉంది. కనుక దాని గురించి మాట్లాడటం లేదిప్పుడు. సదావర్తి భూముల వేలాన్ని రద్దు చేయాలని కోరుతూ బ్రాహ్మణ సమాక్య తరపున ద్రోణంరాజు రవికుమార్ వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు అది విచారణకి అర్హమైనది కాదని చెపుతూ మంగళవారం ఆ కేసుని కొట్టివేశారు. చెన్నై సమీపంలో మహాబలిపురం వద్ద ఉన్న 86 ఎకరాల సదావర్తి సత్రవ భూములు ఆక్రమనలకి గురవుతున్నాయనే సాకుతో వేలం వేయించి కోట్లు పలికే వీలైన భూమిని ఎకరం రూ.22 లక్షలకే తెదేపా నేతలు స్వంతం చేసుకొన్నారని, కనుక దానిని రద్దు చేసి మళ్ళీ బహిరంగ వేలం నిర్వహించాలని కోరారు. దానిపై నిన్న ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ వాదనకి బలమైన ఆధారాలు చూపకపోవడంతో, అది విచారణార్హం కాని కేసు అని పేర్కొంటూ కొట్టి వేశారు. పత్రికలలో వచ్చిన వార్తలు ఆధారంగా కేసు పెట్టినందుకు పిటిషనర్ ని హైకోర్టు మందలించింది.
సదావర్తి కుంభకోణంపై లోతుగా అధ్యయనం చేసేందుకు ధర్మాన ప్రసాద రావు నేతృత్వంలో కొందరు వైకాపా నేతలు చెన్నై కూడా వెళ్లి వచ్చారు. ఆలయ భూములని కూడా చూడకుండా తెదేపా నేతలు కారుచౌకగా కొట్టేశారని విమర్శించారు. సాక్షి మీడియాలో కూడా సదావర్తి భూముల విషయంలో జరిగిన అవినీతి గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రచురించింది.
వైకాపా తను స్వయంగా న్యాయ పోరాటం చేయకపోయినా పిటిషనర్ కి తను సేకరించిన వివరాలన్నీ అందించి సహకరించి ఉండి ఉంటే, హైకోర్టు ఆ కేసుని అంత తేలికగా కొట్టేసి ఉండేదే కాదు. అవసరమైతే విచారణకి కూడా ఆదేశించి ఉండేది. కానీ వైకాపా ఎందుకో పట్టించుకోకపోవడంతో సదావర్తి కధ కంచికి చేరింది.