అన్నయ్య నీతులు చెబుతాడు.. కానీ పాటించడు అని డైలాగ్ జగన్ రెడ్డికి సరిగ్గా సెట్ అవుతుందేమోననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయాలో చేసేసి, ఇప్పుడూ అదే చేస్తున్న జగన్ తాజాగా ఎక్స్ లో ప్రజాస్వామ్య పరిరక్షుడిగా నీతిసూత్రాలు వల్లించారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. విశాఖ మేయర్ పీఠం కూటమికి దక్కుతుండటంతో జగన్ కు అకస్మాత్తుగా ప్రజాస్వామ్యం, రాజకీయ విలువలు గుర్తుకు వచ్చాయి.
వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తీరు ఇంకా రాష్ట్ర ప్రజలు ఎవరూ మరిచిపోలేదు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నేతలపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేసి వేధించారు. వైసీపీకి వ్యతిరేక స్వరం వినిపించిన నేతలను జైల్లో వేసి నిర్బంధించి వీడియోలను చూసి రక్షాసానందం పొందారు. టీడీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలను అనధికారికంగా పార్టీలో చేర్చుకొని, ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలపై ఇష్టారీతిన కామెంట్స్ చేయించారు. పార్టీ కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పిన లీడర్లకు, బూతుపురాణం వినిపించే నేతలకు బహుమానంగా మంత్రి పదవులను కట్టబెట్టారు.
మొత్తంగా గత ఐదేళ్లలో ప్రజాస్వామ్యం గొంతు నులిమారు అనే అప్రతిష్టను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అందుకు జగన్ మొదటి దోషి అయితే, సజ్జల రెండో దోషిగా బోనులో నిలుచుంటారని చెబుతుంటారు. పార్టీ అధికారం కోల్పోయాక అయినా జగన్ లో ఏమైనా మార్చు వచ్చిందా అంటే ఇంకా ప్రజాస్వామ్య వెక్కిరింత చర్యలకే పాల్పడుతున్నారు. పులివెందుల ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని జగన్ అవమానిస్తున్నారు. అలాంటిది ఆయనే ప్రజాస్వామ్యం గురించి, రాజకీయ విలువల గురించి మాట్లాడటం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
పైగా.. తన తల్లి జన్మదినం రోజున కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పని జగన్ రెడ్డి, విలువల గురించి మాట్లాడటాన్ని ఎద్దేవా చేస్తున్నారు.