వైఎస్ షర్మిలకు అధిష్టానం ఇచ్చిన హామీని ఎట్టకేలకు నెరవేర్చబోతుందా? త్వరలోనే ఆమెను చట్టసభలకు పంపనున్నారా? అన్న కాదంటే అక్కున చేర్చుకొని ఆమెకు చేసిన ప్రామిస్ ను సాకారం చేయబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల త్వరలోనే రాజ్యసభకు ఎన్నిక అవ్వనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో త్వరలో రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాలు దక్కనున్నాయి. వీటిలో ఒక స్థానం షర్మిలకు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీలో చేరే సమయంలోనే రాజ్యసభ సీటు ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చింది. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది.
త్వరలోనే అక్కడ ఖాళీ కానున్న సీట్లలో ఒక స్థానాన్ని షర్మిలతో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు ఉపముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కూడా సానుకూలంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్టంలో వైసీపీ బలహీనంగా ఉండటంతో.. ఆ ఓటుబ్యాంక్ ను కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేసుకునేందుకు షర్మిలకు పదవి అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. మొత్తానికి త్వరలోనే చట్టసభలకు వెళ్లాలనుకున్న షర్మిల కల ఎట్టకేలకు సాకారం కానున్నట్లు సమాచారం.