అప్పుడెప్పుడో ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ ఆపేసిన పత్రికలను తిరిగి ముద్రిస్తామని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. వీటిలో వివాదాస్పద నేషనల్ హెరాల్డ్ తో పాటు ఈ పార్టీ వాళ్లే వెనుకటికి హిందీలో ముద్రించిన నవజీవన్ తో పాటు ఒక ఉర్దూ పత్రిక కూడా ఉన్నాయి. వీటన్నింటి పునర్ముద్రణనూ ఒకేసారి ప్రారంభిస్తున్నట్టుగా ఏఐసీసీ ఒక ప్రకటన చేసింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన దారుణమైన ఎదురుదెబ్బ ఆ తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తగులుతున్న దెబ్బల అనంతరం ఈ పత్రికల పునర్ముద్రణ ప్రారంభిస్తున్నామని ప్రకటించింది.
వెనుకటికి ఈ పత్రికల ముద్రణ ఆగిపోవడానికి, కాంగ్రెస్ పతనానికీ సంబంధం లేకపోయినా, ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నట్టుగా కాంగ్రెస్ హైకమాండ్ వీటి ముద్రణను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది. మరి ఇప్పటకే కోర్టుకు ఎక్కిన నేషనల్ హెరాల్డ్ ముద్రణను ప్రారంభించడం సాధ్యం అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఇప్పటికే దేశంలో అన్ని పార్టీలకూ సొంత మీడియా హౌస్ లు ఉన్నాయి. కాంగ్రెస్ కూ ఈ లోటు ఏమీ లేదు. ఈ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అనుకూలంగా పనిచేసే మీడియా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న చోటే దీన్ని పట్టించుకునే మీడియా లేదు.
అయితే ఏదో అనుకూల మీడియా ఉన్నంత మాత్రాన అద్భుతాలు జరుగుతాయని ఆశించడం భ్రమే అవుతుంది. అయితే కొంత వరకూ ఉపయోగం ఉండవచ్చు. సొంతంగా మీడియా హౌస్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. దాన్ని మెయింటెయిన్ చేయడంలో ఓర్పునేర్పులు కూడా కీలకమైనవే. ఈ పత్రికలకు కాంగ్రెస్ నేతలే ఎడిటర్లుగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పోటీలో తమ పార్టీ పత్రికలను మిగతావాటికి ధీటుగా తీసుకొచ్చే సమర్థుడు ఆ పార్టీలో ఉన్నాడా? అనేది సందేహమే. కేవలం పార్టీ కార్యకర్తల కోసమే పత్రిక నడిపేటట్టు అయితే దాని అసలు లక్ష్యాలు మాత్రం నెరవేరవు. పార్టీకి అనుకూలంగా ఉంటూ ఆదరణ సొంతం చేసుకోవడం కత్తిమీద సామే. ఆ సామును కాంగ్రెస్ వాళ్లు ఏ మేరకు సమర్థవంతంగా చేస్తారో చూడాలి!