ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్యం కుతకుత ఉడుకుతునే ఉంది. ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అక్కడ ఆందోళనలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. గత నెలలలో న్యూయార్క్ నుంచి అలాస్కా వరకు ఆందోళనలు చేపట్టిన అమెరికన్లు.. తాజాగా మళ్లీ అదే తరహలో నిరసనలకు దిగారు.
న్యూయార్క్ లోని మెయిన్ లైబ్రరీ నుంచి బయటకు వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించి నిరసనలు చేపట్టారు. అమెరికాలో రాజులు ఎవరూ లేరు .. ఈ దౌర్జన్యాన్ని ఎదురించండి అంటూ నినాదాలు చేశారు. తాత్కాలిక వలసదారులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.
ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. తాత్కాలిక వలసదారులకు ఉన్న చట్టపరమైన నివాస హోదాలను రద్దు చేయడం, వారిని బహిష్కరించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు రాజుకుంటున్నాయి. మీకు ఎలాంటి భయం లేదు.. వలసదారులకు స్వాగతం అంటూ అమెరికన్లు నినాదాలు చేశారు. ట్రంప్ తన విధానాలను మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఇచ్చే ఎఫ్1 వీసా గడువు ముగిసినా పాలస్తీనాకు చెందిన విద్యార్థి లెగా కోర్దియాను ఇంకా అక్కడే ఉండటంతో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మరో పాలస్తీనా విద్యార్థిని అరెస్ట్ చేయడంతో వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. తాత్కాలిక వలసదారులకు ఉన్న చట్టపరమైన నివాస హోదాలను రద్దు చేయడంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా, ట్రంప్ మాత్రం తను తీసుకున్న నిర్ణయాలపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు