ఆయన పోలీసు, డీజీపీగా కూడా పని చేశారు. తన కుటుంబ సమస్యలను పోలీసు పద్దతిలోనే పరిష్కరించుకోవాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులను డీల్ చేసే విధానం అది కాదని ఆయన తెలుసుకునే సరికి ప్రాణాలు పోయాయి. కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ ను ఆయన భార్య హత్య చేసిన ఘటన అనేక విషయాలు వెల్లడి అవుతున్నాయి. దశాబ్దాల పాటు సంపారం చేసిన భర్తను చంపడానికి కారణం భయమేనని పోలీసులు అంచనాకు వస్తున్నారు.
ఓం ప్రకాష్ డీజీపీగా రెండేళ్ల పాటు పని చేసి 2017లో రిటైరయ్యారు. బాగానే ఆస్తులు కూడబెట్టారు. రిటైరయినప్పటి నుంచి ఇంట్లో ఆస్తుల వివాదాలు ఉన్నాయి. కానీ పరిష్కరించడం లేదు. పైగా తుపాకీ పట్టుకుని ఇంట్లో తిరుగుతూ అందర్నీ భయపెడుతున్నారు. పోలీసుగా పని చేసిన మనస్థత్వం రిటైరైన తర్వాత కుటుంబసభ్యులపై చూపిస్తున్నారు. ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుందేమో కానీ.. ఐ కిల్డ్ మాన్ స్టర్ అని.. చంపేసిన తర్వాత ఓం ప్రకాష్ భార్య మరో మాజీ డీజీపీ భార్యకు మెసెజ్ పెట్టింది.
తమను చంపేస్తాడన్న భయంతోనే రివర్స్ లో కుటుంబసభ్యులు కొంత మంది కలిసి ఓం ప్రకాష్ ను చంపేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఓం ప్రకాష్ భార్యను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమార్తె ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. కారణం ఏదైనా డబ్బులు కాస్త సంపాదిస్తే.. వాటి కోసం కొట్టుకునే కుటుంబసభ్యులతో ఇంటిపెద్దకు మానసిక శాంతి ఉండదు. ఆ సమస్యలను సరిగ్గా పరిష్కరించకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి.
ఆస్తుల విషయంలో ఇటీవల చాలా సెలబ్రిటీ కుటుంబాలు కూడారోడ్డున పడుతున్నాయి. అలాంటి ఇళ్లల్లో ఇలాంటి ఘోరాలు జరగకుండా పెద్దలు మేలుకుని.. పరిష్కరించుకుంటే .. వివాదాలు నేరాలు దాకా పోకుండా ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.