మంగళవారం సాయంత్రం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా పర్యటన మొదలు కానుంది. చాన్నాళ్ల కిందటే ప్రతిపాదనలో ఉండి.. వరసగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జగన్ చేపట్టాడు. మంగళవారం రాత్రికి అక్కడే బస చేసి.. బుధవారం కూడా జగన్ ఈ జిల్లాలో పర్యటించనున్నాడు. మరి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ జిల్లాలో ఇప్పుడు జగన్ పర్యటన పట్ల ఎలాంటి స్పందన ఉంటుందనేది!
ఎన్నికల్లో వైకాపాను చావుదెబ్బ కొట్టింది గోదావరి జిల్లాలే. అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలే వైకాపాకు ఐదేళ్ల పాటు అధికారాన్ని దూరం చేశాయి. అయితే ఎన్నికల తర్వాత కూడా జగన్ ఈ జిల్లాల్లో పర్యటించాడు. అనంతలో రైతు భరోసా యాత్రను చేపట్టాడు. అక్కడేమో బ్రహ్మాండమైన జన స్పందన వచ్చింది. అనంతలో జగన్ పర్యటన సందర్భంలో జనాలు బాగా రావడంపై అధికార పార్టీ కూడా చర్చించుకుంది. రైతు రుణమాఫీ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుని తెలుగుదేశానికి ఓటేసిన జిల్లా ఇది. అయితే రుణమాఫీ పథకం అమలు అంతంత మాత్రమే. ఈనేపథ్యంలో జగన్ సభలకు జనం రావడం ఆసక్తికరమైన అంశం.
ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక కీలకమైన డెవలప్ మెంట్ ఉంది. కాపు రిజర్వేషన్ల విషయంలో ఈ మధ్యనే అట్టుడికాయి ఈ జిల్లాలు. ముద్రగడ పద్మనాభం దీక్ష, దాన్ని విరమింపజేయడానికి పోలీసులు ఆయన కుటుంబీకుల తో వ్యవహరించిన తీరు.. కాపుల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించింది. కాపులను బీసీల్లోకి చేర్చడం అనే.. ప్రక్రియ కూడా ఇప్పటి వరకూ ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంలో సహజంగానే ఆ సామాజికవర్గంలో అసంతృప్తి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో కాపుల జనసాంద్రత ఎక్కువగా ఉండే పశ్చిమలో జగన్ కు ఎలాంటి స్పందన ఉంటుంది.. ఒక్క ఎమ్మెల్యే కూడా లేని చోట జనాలను తెచ్చేదెవరు? అనే ప్రశ్నలకు మంగళ, బుధవారాల్లో జగన్ పర్యటన సమాధానాలు ఇవ్వగలదు.