వైసీపీ హయాంలో తిరుమలలోనూ చక్రం తిప్పిన స్వరూపానందకు ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. స్వామిజీ ముసుగులో ఆయన చేసిన నిర్వాకాలన్నీ వెలుగులోకి రావడంతో కనిపించకుండా పోయారు. తిరుమలలో శారదాపీఠం పేరుతో భారీ గెస్ట్ హౌస్ నిర్మించారు. ఆ నిర్మాణం నిబంధనలకు విరుద్ధం. శ్రీవారి ఆలయం కంటే ఎత్తుగా నిర్మించే ప్రయత్నం చేశారు. దీనిపై కోర్టుల్లో కేసులు పడ్డారు. కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీటీడీ చర్యలు తీసుకుంది.
తిరుమలలో నిర్మించిన భవనాన్ని టీటీడీకి స్వాధీనం చేయాలని కోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. అప్పుడు తిరుమలలో స్వరూపానంద కట్టిన భవనంపై హక్కులన్నీ టీటీడీకే చెందుతాయి. ఇప్పటికే విశాఖలో ఓ కొండను గత ప్రభుత్వ పెద్దలు ఆయనకు రాసిచ్చారు. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చిన ముషిడివాడలో ఉన్న ఆశ్రమంలో కబ్జా చేసిన కాలువ స్థలాన్ని అప్పగించాలని నోటీసులు జారీ చేసింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆలయాలు, మొత్తం దేవాదాయశాఖపై పెత్తనం చేసిన ఆయన ఇప్పుడు కనిపించడం లేదు. రుషికేశ్ కు వెళ్లారో.. హైదరాబాద్ కోకాపేటలో కేసీఆర్ ప్రభుత్వ రెండు రూపాయలకు ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో ఆశ్రమం కట్టుకుని ఉంటున్నారో స్పష్టత లేదు. తన వారసుడిగా ప్రకటించుకున్న మేనల్లుడు కూడా పెద్దగా కనిపించడం లేదు.