బిజెపి ప్రధాన కార్యదర్శి మురళీధర రావు మీడియాతో చెప్పిన మాటలు ఆ పార్టీ వారికి బాగా ఇరకాటంగా వున్నాయి. ఇటీవలే రాజకీయ శూన్యత గురించి దాన్ని భర్తీ చేయడం గురించి బిజెపి నేతలు వ్యూహాత్మక మధనం జరిపి వచ్చారు. ఊపుగా ఉధృతంగా ముందుకు పోతామని కథనాలు ఇస్తున్నారు. ఇలాటి సమయంలో మురళీధరరావు వచ్చి తమకు సరైన నాయకత్వం లేదని చెప్పడం స్థానిక నేతలకు రుచించలేదు. నిజానికి ఏ పార్టీ అయినా అలా చెప్పుకుంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మురళీధర రావు చిన్న వయసులోనే జాతీయ పదవి చేపట్టారనే ప్రశంస వున్నా ప్రధాని మోడీకి అంత ఇష్టంగా లేరని ఆరెస్సెస్ ప్రతినిధులు చెబుతుంటారు. ఒక జాతీయ సమావేశంలో అందరి ముందు మోడీ ‘ఏదైనా చేస్తే ఇదిగో మీ మురళీ ధర రావు వంటివారే అడ్డుతగులుతారుగా’ అన్నట్టు ఒక ప్రతినిధి చెప్పారు. తెలంగాణ బిజెపి అద్యక్షుడి ఎంపిక తరుణంలో ఆయన పేరు కూడా పరిశీలనకు వచ్చినా ఈ కారణంగానే జరిగేది కాదని వారు చెప్పేవారు. మరి ఇవన్నీ ఆయన మనసులో వున్నాయో లేదో గాని సత్తా వున్న నేతలు 40 మందికి మించి లేరని చెప్పడం మాత్రం టిబిజెపికి మింగుడు పడలేదు. మీలాటి జాతీయ నేతలూ, కేంద్రమంత్రులే వున్నప్పుడు మామూలు నేతల మాటెందుకు అని వారు ప్రశ్నిస్తున్నారు. బహుశా దీనిపై మురళీ ధరరావు వివరణ ఇచ్చే అవకాశం వుంది. పైగా టిఆర్ఎస్ నాయకురాలు కవితను చేర్చుకోవడం వంటి అంశాలు అంత యథాలాపంగా ఎలా మాట్లాడతారని కూడా వారు నిలదీస్తున్నారు.