మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు దర్శకుడు బాబీ. మాస్, కమర్షియల్ సినిమాలు తీయడంలో తనకంటూ ఓ స్టైల్ సంపాదించుకొన్నాడు. తన అభిమాన నటుడు చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తీశాడు. చిరంజీవి కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాతో బాబీ కూడా టాప్ లీగ్‌లోకి చేరిపోయాడు. ఇప్పుడు మరోసారి చిరంజీవితో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. చిరు కూడా బాబీతో వర్క్ చేయడానికి రెడీ. ఈమధ్య చిరు – బాబీల మధ్య భేటీ కూడా జరిగిందని తెలుస్తోంది. చిరు కోసం ఓ కొత్త కథ తయారు చేసుకొని వినిపించాడట బాబీ.
అయితే ఇక్కడ నిర్మాతతోనే సమస్య. ఈ ప్రాజెక్ట్ కి ఓ సరైన ప్రొడ్యూసర్ కావాలి. చిరునే ప్రొడ్యూసర్ని సెట్ చేస్తానని బాబీకి మాట ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 అవుతుందని తెలుస్తోంది. ఇప్పుడు చిరు పారితోషికం దాదాపు రూ.75 కోట్లు. మిగిలినవాళ్ల పారితోషికాలకు మరో రూ.25 కోట్లు వేసుకొన్నా, మేకింగ్ కి మరో రూ.100 కోట్లు అవుతాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా కూడా ఇంతే బడ్జెట్. ఇండస్ట్రీలో ఉన్న టాప్ బ్యానర్ల వరకూ ఈ కథ వెళ్లింది. వాళ్ల చేతుల్లో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే.. ఇప్పుడు చిరు సినిమాపై పెట్టుబడి పెట్టే ఆలోచన చేయడం లేదు. కొత్త, మీడియం నిర్మాతలు రూ.200 కోట్లు పెట్టలేరు. ఆ విషయంలోనే ఇప్పుడు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈలోగా బాబీకి మిగిలిన హీరోల నుంచి ప్రెజర్ వస్తోందని, చిరుకి ప్రొడ్యూసర్ దొరికే వరకూ ఖాళీగా ఉండకుండా, మరో సినిమా సెట్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.