వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగేలా చూసేందుకు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు. ఇప్పటికే కోడికత్తి శీను కుటుంబాన్ని పరామర్శించిన ఆయన తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు విచారణ పోలీసు వ్యవస్థకే ఓ మచ్చ అన్నారు.
చార్జిషీట్లో నిందితుడు చెప్పింది మాత్రమే రాశారని.. చార్జిషీటు దానంతటకు అది వీగిపోయేలా.. కేసు కొట్టేసేలా పోలీసులు నిమిత్తమాత్రంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ కేసు విషయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోలీసుల్ని ప్రభావితం చేశారని అన్నారు. పోలీసుల తీరును వివరిస్తూ కోర్టుకు వెళ్లి పునర్విచారణ చేయాలని ఏబీవీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.
డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసి అనంతబాబు కేసులో పోలీసులు అసలు విచారణ చేయలేదు. నేనే చంపానని ఒప్పుకున్నాడని.. పోలీసులు ఇక దర్యాప్తు చేయలేదు. చివరికి సుప్రీంకోర్టులో కూడా సమయానికి చార్జిషీటు దాఖలు చేయలేదని బెయిల్ ఇచ్చింది. ఇటీవల ఈ కేసులో న్యాయసాయం కోసం ఆ కుటుంబానికి మొదటి నుంచి అండగా ఉన్న లాయర్ కు బాధ్యతలు ఇచ్చింది. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు కూడా వారికి భరోసా ఇస్తన్నారు.
రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన ఏబీవీ.. సొంత పార్టీ పెట్టుకుంటారా.. ఏదైనా పార్టీలో చేరుతారా అన్నది ప్రకటించలేదు. అయితే జగన్ టార్గెట్ గానే ఆయన రాజకీయాలు చేస్తున్నారు.