రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారాల పైన, కుల సమీకరణల పైన , కథనాలు ఇవ్వడం సూర్య దినపత్రిక ప్రత్యేకత. మామూలుగా వినవచ్చే గ్యాసిప్లను లేదా వ్యక్తిగత వ్యూహాలపై అంచనాలను కూడా ఆపత్రిక పెద్దగా ప్రచురిస్తుంటుంది. తెలుగుదేశంలో నారా లోకేష్ నెంబర్ 2 గా తన స్థానాన్ని సుస్థిరపర్చుకున్నారని మంగళవారం ఒక కథనం ప్రచురించింది సూర్య. అందులో ఇతర విషయాలు ఎలా వున్నా సారాంశం అందరూ అనుకునేదే. కాకపోతే చిన్న సవరణ చేయక తప్పదు.
లోకేష్ ను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడంతో సహజంగానే ద్వితీయ స్థానం వచ్చేసింది. అది అధికార పూర్వకమే. తెలుగుదేశంలో నెంబర్2 ఎప్పుడూ సమస్యాత్మకమని ఒక జోకుంది. దాంట్లో నిజం కూడా వుంది. నాదెండ్ల బాస్కరరావు,పర్వతనేని ఉపేంద్ర, కొంత వరకూ చంద్రబాబు నాయుడు, తర్వాత దేవేందర్ గౌడ్ అందరూ ఈ నెంబర్ టూ బగ్ బాధపడిన వారే. ఇవన్నీ చూశారు గనకే చంద్రబాబు లోకేష్‌కు ఆ బెడద రాకుండా చేశారు. తెలుగుదేశంలో లోకేష్ నెంబర్ 2 కాదు- నెంబర్ 1ఎ. . ఆయన ముద్రలేకుండా ఏదీ జరగదని పార్టీలో అందరికీ నమ్మకం ఏర్పడింది. అదే సమయంలో చంద్రబాబు శైలికీ ఆయనకూ మధ్యన తేడా గురించి చర్చ జరుగుతూనే వుంటుంది. ఇటీవల కొన్ని తప్పిదాలు జరిగి ఓటుకు నోటు, కాల్‌మనీ వంటి సమస్యలు వచ్చినప్పుడు కొందరు ఆయన అలాటివారికి అండగా నిలవడం కూడా ఒక కారణమని లోలోపల సణుక్కున్నారు తప్పపైకి అనే సాహసం చేయలేకపోయారు.ఏమైతేనేం తండ్రికి సమాంతరంగా పార్టీ ప్రభుత్వ వ్యవహారాలను సమీక్షిస్తూ ఆదేశాలిస్తూ ఒక అంతర్గత సమాంతర శక్తిగా స్థిరపడిపోయారు. అన్నట్టు ఆర్థిక నిర్ణయాలు రాజకీయ వ్యూహాలు టీవీ చర్చలు అన్నిటినీ సమీక్షిస్తుంటారు.(ఇటీవల మిత్రులొకరిని ఛానల్నుంచి తప్పించినప్పుడు కూడా ఆయన పేరే వినిపించింది. ఆయన బహిరంగంగానే ఆ పేరు ప్రస్తావించారు కూడా) అక్కడ అఖిలేష్ ఇక్కడ లోకేష్ అన్న చంద్రబాబు వ్యూహం నిజం చేస్తుంటారు.ఆయనను కేంద్రానికి పంపిస్తారని గతంలో వూహాగానాలు వచ్చినా అవేవీ నిజం కాలేదు. తండ్రి పాలనకు సహకరిస్తూ పార్టీపై పట్టుపెంచుకోవడం లోకేష్ ప్రస్తుత మిషన్‌గా వుంది. మంత్రి వర్గంలోకి తీసుకోవడం గురించి కూడా చంద్రబాబు నాయుడు సానుకూల సంకేతాలే పంపించారు గనక అదైనా సంభవమే. అయితే దానివల్ల ఆయన ఒక చట్రంలో ఇమిడిపోతారని పార్టీపై పట్టు తగ్గుతుందని మరో అభిప్రాయం వచ్చి వాయిదా వేసినట్టు కనిపిస్తుంది లోకేష్‌కు మంత్రిపదవిపెద్ద సమస్య కాదు. అంతకన్నా అధికతర పాత్ర ఇప్పటికే నిర్వహిస్తున్నారు గనక.