మరణం కంటే పెద్ద విషాదం జీవితంలో ఏమీ ఉండదు. సినిమాల్లో చావు సన్నివేశాలు హృదయాన్ని పీల్చి పిప్పి చేసేలా చిత్రీకరిస్తుంటారు. హెవీ ఎమోషన్‌కి అక్కడే స్కోప్ దొరుకుతుంది. సినిమాల్లో ఓ శవం లేచిందంటే – విషాద గీతానికి తెర తీసినట్టే. ‘చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు..’ దగ్గర్నుంచి ‘ఒక్కడే రావడం.. ఒక్కడై పోవడం’ వరకూ చావుని చిత్రీకరించిన పాటలెన్నో. వాటి మధ్య ‘కుబేర’లో ‘పోయిరా..’ పాట కొత్తగా వినిపిస్తోంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శేఖర్ కమ్ములతో దేవిశ్రీ ప్రసాద్ అనే కాంబోనే వింతగా, కొత్తగా అనిపించింది. వీళ్ల నుంచి ఎలాంటి పాటలొస్తాయ్? అనే ఆత్రుతకు ‘పోయిరా’ పాటతో సమాధానం దొరికింది. ముందే చెప్పినట్టు ఇది ‘చావు’ పాట. అయితే మరణం, చావు, శవం, అంతిమ యాత్ర.. ఇలాంటి పదాలకు ఈ పాటలో ఎక్కడా చోటు లేదు. విషాదం కాస్త కూడా తొంగి చూడలేదు. ఓ మరణాన్ని సెలబ్రేషన్ గా చిత్రీకరించిన తీరు.. కొత్తగా అనిపించింది. భాస్కరభట్ల రవికుమార్ కలం కొత్త సిరా నింపుకొని, అక్షరాలతో గుభాళించింది. ‘పోయిరా.. పోయిరా పోరాయిరా మామ’ అనే హుక్ లైనే… బాగా క్లిక్ అయిపోయింది. అక్కడే ఈ పాట హిట్టయిపోయింది. ఇక పాటలో పలికించిన భావాలు, చెప్పిన ఎక్స్ప్రెషన్… ఈ గీతాన్ని నిలబెట్టాయి.
పాటలో చాలా చోట్ల ‘చావులో ఇంత సుఖం ఉందా’ అనేపించే ఫీలింగ్ కలిగించింది భాస్కరభట్ల సాహిత్యం.
వన్ డే హీరో నువ్వే ఫ్రెండూ – నీ కోసమే డప్పుల సౌండు
అస్సల్ తగ్గక్ అట్నే ఉండు – మొక్కూతారు కాళ్లూ రెండూ
నిన్నే చూస్తున్నాది చూడు – ఊరు మొత్తం దేవుళ్లాగ
వన్ వే లోన నువ్వెళ్లినా – ఆపర్నిన్ను అందరిలాగ… ఇలా మొదలైంది పాట. మధ్యలో…
ముందర్లాగ అంతీజీగా నిన్నే కలుసుకోలేరుగా
నీతో ఫొటో దిగాలన్నా సచ్చేటంత పనౌతుందిగా..
చూస్తూ చూస్తూనే మారింది నీ రేంజు ఈ రోజున
నిన్నే అందుకోవాలి అనుకొంటే సరిపోదే ఏ నిచ్చెన
నిన్నే తిట్టి గల్లా పట్టి సతాయించే సారే లేడులా..
స్వర్గం.. అరె నీ జేబులో వుంది.. బాధే లేదు ఏ నాటికీ
ఏరో ప్లెయినూ, రాకెట్టూ నీ కాళ్ల కింద ఎగరాల్సిందే
ఎంతోడైనా తలే ఎత్తి.. అలా నిన్ను చూడాల్సిందే
తలరాతని చెరిపేసి రాసేసుకో నీకే నచ్చింది – ఇలా చావులోని సౌలభ్యాలూ, సుఖాలూ హుషారుగా చెప్పుకొంటూ పోయారు.
ధనుష్ ఈ పాటని పాడిన విధానం బాగుంది. దేవిశ్రీ ట్యూన్ కూడా క్యాచీగా వుంది. మొత్తానికి ఇక ముందు.. చావు పాటలంటే… ‘పోయిరా’ గుర్తుకు రావాల్సిందే అలానే ఈ పాటని రూపొందించారు.