ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి కేటాయించిన భూముల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఆ కంపెనీకి సామర్థ్యం లేకపోవడమే కారణం. తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. ఏపీ ప్రభుత్వం నేరుగా భూములు కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. ఆ కంపెనీ ఎలా ఏఐ పవర్డ్ డేటా సెంటర్లు పెడుతుందన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం కొంత మంది సిఫారసు చేశారని ఆ భూములను కేటాయించి ఉంటుంది. వారు పెట్టాల్సిన పరిశ్రమకు తప్ప మరో విధంగా ఆ భూముల్ని వినియోగించుకోలేరు. అయినా ఇలాంటి కంపెనీలకు భూములు కేటాయించినప్పుడు ముందూ..వెనుకా చూసుకోకపోతే బురద పడిపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
ఉర్సా కంపెనీపై ఆరోపణలు – ప్రభుత్వం స్పందించాల్సిందే !
ఉర్సా కంపెనీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలో అయినా .. ఇక్కడ అయినా అసలు ఆ కంపెనీలు వ్యాపార లక్షణాలు లేవని తేలిపోయింది. ఎక్కడా వ్యాపారం చేసింది లేదు.. రూపాయి ఆదాయం సంపాదించినది లేదు. చిన్న చిన్న ఇళ్లు, ఫ్లాట్లలో ఆఫీసులు ఉన్నాయి. కొత్తగా పెట్టారు. ఇలాంటి సంస్థ ప్రతిపాదనలు పెట్టగానే భూములు కేటాయించడం అంటే.. ప్రభుత్వం అచేతనంగా..గుడ్డిగా నిర్ణయం తీసుకున్నట్లే. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి వివరణ ఇవ్వాల్సిందే.
వైసీపీ హయాంలో ఉర్సా లాంటి ఇంటలిజెంట్ కంపెనీలు ఎన్నో !
ప్రభుత్వాలు ఇలాంటి కంపెనీలకు భూములు కేటాయిస్తూ ఉంటాయి. ఆ లెక్కలెంటో బయటకు రావు. వైసీపీ హయాంలో కేటాయించిన భూ కేటాయింపుల్లో 80 శాతం ఇలాంటి కంపెనీలకే కేటాయించారు. ఇంటలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ అనే కంపెనీకి వైసీపీ హయాంలో 298 ఎకరాలు కేటాయించారు. భూములు కేటాయించడానికి కొద్ది రోజుల ముందు హాంకాంగ్‌లో రిజిస్టర్ చేశారు. ఇండియాలో అసలు రిజిస్టర్ చేయలేదు. విదేశీ అని నమ్మించేందుకు ఇలా చేశారు. ఆ కంపెనీకి వెబ్ సైట్ కూడా లేదు. ఇలాంటివి వైసీపీ హయాంలో చాలా ఉన్నాయి. స్వయంగా పులివెందులలోనూ అలాంటి కంపెనీలకు భూములు కేటాయించారు. కానీ పనులు మాత్రం జరగలేదు. పరిశ్రమలు ప్రారంభం కాలేదు.
భూములు అప్పగించే వరకూ ఎన్నో దశలు
ఉర్సా కంపెనీకి ఇచ్చిన భూములు కేబినెట్ తీసుకున్న నిర్ణయం. ఆ భూముల కేటాయింపునకు సవాలక్ష రూల్స్ ఉంటాయి. పెట్టుబడుల దగ్గర నుంచి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అన్నీ సంతృప్తి పరుస్తేనే భూములు కేటాయిస్తారు. ఏ మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా రద్దు చేస్తారు. ప్రభుత్వ భూముల్ని తీసుకుని పరిశ్రమలు పెట్టని వారి నుంచి ప్రభుత్వాలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చన్న నిబంధన ఉంటుంది. భూముల కేటాయింపుతోనే ఏమీ జరిగిపోదు కానీ.. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వంపైన.. ప్రభుత్వ నిర్ణయాలపైనా బురదపడుతుంది. అందుకే పరిశ్రమలు పెడతామంటూ వచ్చే వారి విషయంలో ఎన్నో పరిశీలనలు చేయాల్సి ఉంటుంది.