బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాను వదిలేయబోతున్నారా? అక్కడి నేతల నుంచి కవితకు సంపూర్ణ మద్దతు లేకపోవడంతో తన రాజకీయ కార్యక్షేత్రాన్ని మార్చబోతున్నారా? ఆమె ఇకపై ఖమ్మం గుమ్మంలో పాలిటిక్స్ చేయబోతున్నారా?
కవిత ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు మంత్రులు ఉండి జిల్లాను డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యారని విమర్శించిన ఆమె…అభివృద్ధి కోసం ఒత్తిడి తీసుకురావాలన్నారు. అలాగే, ఇకపై జిల్లాలో బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా తనను సంప్రదించాలనడం ఆసక్తి రేపుతోంది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ బాధ్యతలను కవితకు కేసీఆర్ అప్పగించారని అంటున్నా…నిజామాబాద్ జిల్లాలో నేతల సహకారం కొరవడటంతోనే ఆమె ఖమ్మంపై ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. 2019ఎన్నికల్లో కవిత ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని ఆమె కంప్లైంట్. అలాగే, గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ కవిత అభ్యర్థిత్వాన్ని కొంతమంది ఇందూరు నేతలు వ్యతిరేకించారు. అప్పటి నుంచి నిజామాబాద్ పార్టీ నేతలపై కవిత అసంతృప్తిగా ఉన్నారు. ఎంత ప్రయత్నిస్తున్నా అక్కడి నేతల నుంచి ఆమెకు ఆశించిన సహకారం లభించడం లేదు.
పైగా..నిజామాబాద్ లో నానాటికీ బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అందుకే ఆమె ముందస్తుగా తన రాజకీయ కార్యక్షేత్రంగా ఖమ్మంను సెలక్ట్ చేసుకున్నారని, అందుకే ఆమెకు కేసీఆర్ ఖమ్మం పగ్గాలు అప్పగించారు అనే టాక్ నడుస్తోంది. ఇదివరకు ఆమె నిజామాబాద్ ను వీడబోనని వ్యాఖ్యలు చేసినా.. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కవిత మనసు మార్చుకున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.